ఇండియాలో బుల్లెట్ ట్రైన్... చైనా కుట్ర గురించి తెలుసా?
ఈ క్రమంలో మొదటి టీబీఎంం భాగం 2024 అక్టోబర్ నాటికి భారత్ కు చేరాల్సి ఉంది. అయితే... ఇప్పటి వరకు చైనా అధికారులు వీటిని విడుదల చేయలేదు.
By: Tupaki Desk | 25 Jun 2025 5:00 PM ISTభారతదేశం దురదృష్టం ఏమిటో కానీ... ఈ పుణ్యభూమికి శత్రువులు ఎక్కడో ఉండరు.. పక్కనే, సరిహద్దులు పంచుకుంటూ, పక్కలో బళ్లాలులా ఉంటారు! వారి ఎదుగుదలకు భారత్ కావాలి.. కానీ, భారత్ ఎదుగుతుంటే తట్టుకోలేరు సరికదా, తోకలు అడ్డుపెడుతుంటారు! అయినా, ఒక రోజు ఆలస్యం అయినా, భారత్ అనుకున్న లక్ష్యాలను సాధిస్తుంటుంది. తాజాగా బుల్లెట్ ట్రైన్ విషయంలో ఇదే జరుగుతుంది!
అవును... ముంబై – అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్.హెచ్.ఎస్.ఆర్.సీ.ఎల్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు విలువ రూ. 1.08 లక్షల కోట్లు కాగా... దీనికి సంబంధించిన సొరంగ పనుల కోసం జర్మన్ కంపెనీకి మూడు టీబీఎం యంత్రాలను ఆర్డర్ ఇచ్చింది ఎన్.హెచ్.ఎస్.ఆర్.సీ.ఎల్! అయితే... వీటి తయారీ చైనాలోని గ్వాంగ్ జౌ ఫ్యాక్టరీలో జరిగింది.
ఈ క్రమంలో మొదటి టీబీఎంం భాగం 2024 అక్టోబర్ నాటికి భారత్ కు చేరాల్సి ఉంది. అయితే... ఇప్పటి వరకు చైనా అధికారులు వీటిని విడుదల చేయలేదు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే... వీటిని ఎందుకు ఆపేశారు, ఎందుకు విడుదల చేయడంలేదు అనే విషయంపై ఇప్పటివరకు చైనా అధికారికంగా ఏమాత్రం స్పందించలేదు. దీంతో.. ఈ విషయం భారత అధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఎన్.హెచ్.ఎస్.ఆర్.సీ.ఎల్. సంస్థ ముంబై – అహ్మదాబాద్ మధ్య టన్నెల్ నిర్మాణానికి మూడు టీబీఎం యంత్రాలను వినియోగించాలని ప్రణాళిక రూపొందించింది. వీటిలో టీబీఎం-1, టీబీఎం-2 సన్వాలి (ఘన్సోలి) నుంచి విఖ్రోలి, విఖ్రోలి నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మధ్య సొరంగాలను నిర్మిస్తాయి. ఇక.. టీబీఎం-3 విఖ్రోలి నుంచి సన్వాలి మధ్య సొరంగాలను నిర్మిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం... టీబీఎంలు లేకపోతే భూమిలో టన్నెల్ తవ్వకం ప్రారంభించలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ నుండి షిల్ఫాటా వరకు ఉండే 21 కి.మీ పొడవైన టన్నెల్ నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇందులో 7 కి.మీ పొడవైన థానే క్రీక్ కింద సముద్రగర్భ సొరంగం కూడా ఉండగా.. ఇది అత్యంత సవాలుతో కూడుకున్న భాగంగా పరిగణించబడుతోంది.
అయితే... ఈ ఆలస్యం ప్రాజెక్ట్ చివరి గడువుపై ప్రభావం చూపలేదని చెబుతున్నారు. ఈ విషయాలు తెలియని కొంతమంది భారతీయులే... చైనా బుల్లెట్ ట్రైన్ లను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దీంతో.. ఈ బుల్లెట్ ట్రైన్ విషయంలో భారత్ పై చైనా కుట్రలు తెలుసుకోరా అంటూ వారిపై నెటిజన్లు ఫైరవుతున్నారు.
