Begin typing your search above and press return to search.

మళ్లీ పస్ట్ ప్లేస్ లోకి ముఖేష్ అంబానీ..

ఫోర్బ్స్ తాజా ఇండియా బిలియనీర్ల జాబితా ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ 105 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలో నెం.1 కుబేరుడిగా నిలిచారు.

By:  Tupaki Desk   |   9 Oct 2025 4:36 PM IST
మళ్లీ పస్ట్ ప్లేస్ లోకి ముఖేష్ అంబానీ..
X

ముకేష్ అంబానీ మరోసారి ఆధిపత్యం చాటుకున్నారు. ఫోర్బ్స్ తాజా ఇండియా బిలియనీర్ల జాబితా ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ 105 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలో నెం.1 కుబేరుడిగా నిలిచారు. గతేడాది తాత్కాలికంగా రెండో స్థానానికి పడిపోయిన అంబానీ ఈసారి తిరిగి అగ్రస్థానంలోకి చేరి వ్యాపార దృక్పథం, వ్యూహాత్మక చతురతను మరోసారి రుజువు చేసుకున్నారు.

మరింత విస్తరిస్తున్న రియలన్స్ సామ్రాజ్యం..

రిలయన్స్ సామ్రాజ్యం ఒక్క ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జియో టెలికాం ద్వారా ముకేష్ అంబానీ డిజిటల్ విప్లవానికి నాంది పలికారు. ఆయన నాయకత్వంలో రిలయన్స్ రిటైల్, గ్రీన్ ఎనర్జీ, మీడియా, ఈ-కామర్స్ వంటి పలు రంగాల్లో విస్తరించింది. ఈ విభిన్న పెట్టుబడులు సంస్థకు స్థిరమైన ఆదాయం, పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగించాయి. భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ కీలక స్థంభంగా నిలిచిందని చెప్పడం అతిశయోక్తి కాదు.

అదానీకి సవాలు..

ముకేష్ అంబానీ తర్వాత 92 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. గతేడాది అదానీ గ్రూప్ ఎదుగుదల రేటు ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉండగా, మార్కెట్‌లో జరిగిన కరెక్షన్లు, వివిధ నియంత్రణ పరిశీలనల కారణంగా ఆయన సంపదలో కొంత తగ్గుదల కనిపించింది. అయినా ఆయన బిజినెస్ సామ్రాజ్యం పోర్టులు, ఇంధనం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది.

మహిళా శక్తి ప్రతినిధిగా సావిత్రి జిందాల్

జిందాల్ గ్రూప్ అధినేత సావిత్రి జిందాల్ దేశంలోని అగ్రశ్రేణి మహిళా బిలియనీర్లలో ఒకరు. ఉక్కు, సిమెంట్, ఎనర్జీ రంగాల్లో జిందాల్ గ్రూప్స్ స్థిరమైన స్థానాన్ని దక్కించుకుంది. పురుషాధిక్య వ్యాపార రంగంలో సావిత్రి జిందాల్ సత్తా చాటడం ప్రేరణాత్మక విషయం. ఆమె తర్వాతి స్థానంలో టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ (భారతి ఎయిర్‌టెల్ స్థాపకుడు), టెక్ బిలియనీర్ శివ నాడార్ (హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడు) ఉన్నారు.

సామాజిక బాధ్యతతో వ్యాపారం..

ముకేష్ అంబానీ స్థాయి వ్యాపారవేత్తల బాధ్యత కేవలం సంపద సృష్టించడమే కాదు.. సమాజానికి తిరిగి ఇవ్వడం కూడా. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఆయన విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విస్తృతంగా సేవలందిస్తున్నారు. ఈ దృష్టికోణం వ్యాపార నైతికతను సమాజ శ్రేయస్సుతో ముడిపెట్టే ప్రయత్నంగా చెప్పవచ్చు.

ఆర్థిక దిశలో భారత ప్రతిష్ఠ

ముకేష్ అంబానీ మళ్లీ అగ్రస్థానానికి చేరడం, కేవలం వ్యక్తిగత విజయమే కాదు.. భారత ఆర్థిక శక్తి పెరుగుతున్నదని సంకేతం. ప్రపంచ ఆర్థిక వేదికలో భారతీయ వ్యాపారవేత్తలు ఇప్పుడు నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు. వారు పెట్టుబడులు పెట్టే రంగాలు, వారి వ్యూహాత్మక దిశ ప్రపంచ మార్కెట్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కుబేరుల జాబితా

ఫోర్బ్స్ జాబితా కేవలం సంపద గణాంకం కాదు.. దేశ ఆర్థిక సామర్థ్యానికి అద్దం పడుతోంది. అంబానీ, అదానీ, జిందాల్, నాడార్, మిట్టల్ వంటి నాయకులు భవిష్యత్ తరాల వ్యాపారవేత్తలకు ప్రేరణ. ఈ జాబితా సగటు భారతీయ యువతకు ఒక సందేశం పంపిస్తోంది. క్రమశిక్షణ, దూరదృష్టి, పట్టుదల ఉంటే భారతీయులు ప్రపంచ వ్యాపార వేదికలో నాయకత్వం వహించగలరు.