Begin typing your search above and press return to search.

వైసీపీలో ముద్రగడ గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. దీంతో ఏపీ రాజకీయాల్లో సమీకరణలు శరవేగంగా మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.

By:  Tupaki Desk   |   10 March 2024 5:24 AM GMT
వైసీపీలో ముద్రగడ గ్రాండ్  ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పైగా రోజు రోజుకీ పరిణామాలు శరవేగంగానూ మారిపోతున్నాయి. ఇప్పటికే టీడీపీ - జనసేన కూటమితో బీజేపీ జాయిన్ అవ్వడం.. పవన్ ఎంపీగా హస్తినకు వెళ్తారని కథనాలు వస్తుండటం జరుగుతున్న నేపథ్యంలో.. వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. దీంతో ఏపీ రాజకీయాల్లో సమీకరణలు శరవేగంగా మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.

అవును... జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి నచ్చకపోవడంతో ఆ సామాజికవర్గానికి చెందిన కీలక వ్యక్తులు అసహనం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే హరిరామ జోగయ్య విసిగిపోవడం.. ఆయన కుమారుడు వైసీపీలో చేరిపోవడం తెలిసిందే! ఈ సమయంలో కాపు ఉద్యమనేత, ఆ సామాజికవర్గంలో కీలక వ్యక్తిగా పేరున్న ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు!

ఇందులో భాగంగా... ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై స్పష్టత రానప్పటికీ వైసీపీలో చేరడానికి ముద్రగడ పద్మనాభం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో... ఈ నెల 14న ముద్రగడ పత్మనాభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమం కోసం కిర్లంపూడి నుంచి తాడేపల్లి వరకూ ర్యాలిగా వెళ్లి.. వైసీపీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని ముద్రగడ భావిస్తున్నారని తెలుస్తుంది.

ఇదే సమయంలో ఆయనతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా అదే సమయంలో పార్టీలో జాయిన్ అవ్వనున్నారని అంటున్నారు. ఇక వీరు పోటీ చేసే విషయంపై వీలైనంత త్వరలో క్లారిటీ రావొచ్చని సమాచారం. దీంతో... గోదావరి జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ముద్రగడ రాజకీయ ప్రస్థానం!:

కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పత్మనాభం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో 1978, 1983, 1985, 1989 ఎన్నికల్లో ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇదే క్రమంలో 1999లో ఒకసారి ఎంపీగానూ గెలిచారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లోనూ పనిచేశారు.

ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పిఠాపురం నుంచి పోటీచేసి ఓటమి పాలయిన ముద్రగడ.. ఆ ఎన్నికల్లో మూడోస్థానంలో నిలిచారు. దీంతో... నాటి నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక టీడీపీ అధికారంలో ఉండగా.. కాపు రిజర్వేషన్స్ కోసం ఉధ్యమించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఫైరయ్యారు.