Begin typing your search above and press return to search.

మరో షాక్‌.. ముద్రగడా.. మా రెడ్ల పరువు తీయొద్దు!

వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు మరో షాక్‌ ఎదురైంది.

By:  Tupaki Desk   |   11 Jun 2024 7:30 AM GMT
మరో షాక్‌.. ముద్రగడా.. మా రెడ్ల పరువు తీయొద్దు!
X

వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు మరో షాక్‌ ఎదురైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ను చిత్తుగా ఓడిస్తానని.. ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ సవాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ ను ఘోరంగా ఓడించి పిఠాపురం నుంచి తరిమికొడతామని ముద్రగడ భీకర హెచ్చరికలే జారీ చేశారు. అయితే పవన్‌ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలు సాధించిన టాప్‌ టెన్‌ ఎమ్మెల్యేల్లో ఒకరిగా నిలిచి రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గం చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా నిలిచారు.

ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఇచ్చిన మాట మేరకు ఆయన పేరు మార్చుకోవాలని జనసేన శ్రేణులు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌ మొదలుపెట్టాయి. దీంతో ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని.. ఇందుకు గెజిట్‌ పేపర్లు కూడా సిద్ధం చేసుకున్నానని మీడియాకు తెలిపారు.

ఈ క్రమంలో ముద్రగడకు మరో షాక్‌ ఎదురైంది. ఆయన తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకోవడానికి తాను ఒప్పుకోనని.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్‌ కర్రి వెంకట రామారెడ్డి బాంబుపేల్చారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను విడుదల చేశారు. అంతేకాకుండా ఒక వీడియోను కూడా సోషల్‌ మీడియాలో వదిలారు.

ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుని రెడ్ల పరువు తీయొద్దని కర్రి వెంకట రామారెడ్డి హితవు పలికారు.

తాజా శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ మద్దతు పలికిన పార్టీ ఘోర పరాజయం పాలయిందని కర్రి వెంకట రామారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో రెడ్డిగా తన పేరును మార్చుకోవడానికి ముద్రగడ గెజిట్‌ పబ్లికేషన్‌ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నట్టు తనకు తెలిసిందన్నారు.

ఈ నేపథ్యంలో ముద్రగడను తాను కొన్ని వివరాలు కోరుతున్నానన్నారు. ముద్రగడ పద్మనాభంకు రెడ్డి కులంలో చేరటానికి రెడ్లు ఎవరైనా అనుమతి ఇచ్చారా? అని నిలదీశారు. మా రెడ్డి కులంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు..? అని ప్రశ్నించారు. మా రెడ్ల పరువు తీయడానికి మా కులంలో చేరాలనుకుంటున్నారా? అని ముద్రగడపై కర్రి వెంకట రామారెడ్డి నిప్పులు చెరిగారు.

ఈ క్రమంలో ఆంధ్రా రెడ్డి సంఘానికి కూడా వెంకట రామారెడ్డి ప్రశ్నలు సంధించారు. ముద్రగడ ప్రకటనపై రెడ్డి సంఘం ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. నైతిక విలువలు లేని వ్యక్తులు రెడ్లలో చేరాలనుకుంటే గౌరవంగా బతికే రెడ్లు ఎందుకు ఊరుకోవాలని ప్రశ్నించారు. రెడ్డిగా పేరు మార్చుకుంటానని ముద్రగడ ప్రకటించి నాలుగు రోజులవుతున్నా రెడ్డి సంఘం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువలు లేకుండా మాట్లాడేవారిని మన కులంలో ఎందుకు చేర్చుకోవాలని కర్రి వెంకట రామారెడ్డి నిలదీశారు. ముద్రగడలాంటి వ్యక్తులను మన కులానికి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పటికైనా రెడ్డి సంఘం.. ముద్రగడను తమ కులంలో చేర్చుకోవడం లేదని ప్రకటన జారీ చేయాలని కర్రి వెంకట రామారెడ్డి కోరారు. ఏదేమైనా ముద్రగడ.. తమ కులంలో చేరడానికి తాను వ్యతిరేకమని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.