Begin typing your search above and press return to search.

"ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభాన్ని ముఖ్య‌మంత్రిని చేస్తాం''

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు, తెలంగాణ‌లో పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు పార్టీలు పొత్తుల దిశ‌గా అడుగులు వేస్తున్నాయి

By:  Tupaki Desk   |   9 March 2024 1:29 PM GMT
ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభాన్ని ముఖ్య‌మంత్రిని చేస్తాం
X

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు, తెలంగాణ‌లో పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు పార్టీలు పొత్తుల దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. వీటిపై రాజ‌కీయంగా చ‌ర్చ సాగుతోంది. కొంద‌రు వీటిని స్వాగ‌తిస్తున్నారు. మ‌రికొంద‌రు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఏపీ(టీడీపీ+జ‌న‌సేన‌+బీజేపీ), తెలంగాణ‌(బీఎస్పీ+బీఆర్ ఎస్‌) పొత్తుల‌పై ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు కిలారి ఆనంద పాల్ స్పందించారు. ''చేత‌కాని పార్టీలే పొత్తులు పెట్టుకుంటాయి. ప్ర‌జ‌ల్లో ప‌ల‌చ‌నైన పార్టీలే పొత్తు పెట్టుకుంటాయి. పొత్తులు పెట్టుకునే పార్టీల‌కు విశ్వ‌స‌నీయ‌త లేదు'' అని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు.

ఏపీలో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాలలో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని పాల్ ప్ర‌క‌టించారు. వైజాగ్ పార్లమెంట్ స్థానం నుండి తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తాము అడ్డుకుంటామని, అందుకు ఏ స్థాయికైనా వెళ్లి పోరాటం చేస్తామన్నారు. ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరిన మాజీ మంత్రి బాబు మోహన్ వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారని కేఏ పాల్ వెల్లడించారు.

ముద్ర‌గ‌డ‌ను సీఎంను చేస్తాం!

వైసీపీ అంటే అవినీతి పార్టీ అని, వారి అవినీతి ఆకాశాన్ని అంటుకుందని కేఏ పాల్ ఆరోపించారు. బండలు, గుట్టలు, కొండలు ఏదీ వదలకుండా అన్నీ అమ్మేశారని.. చివరికి రాష్ట్ర సచివాలయం బిల్డింగ్‌ను తాకట్టు పెట్టారంటూ ఆయన మండిపడ్డారు. ప్రపంచంలోగానీ, దేశంలోగానీ ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదని.. అలాంటి వైసీపీ పార్టీలో కాపు నేత ముద్రగడ పద్మనాభం చేరడం సరికాదన్నారు. చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే, అవినీతి పార్టీ వైసీపీకి బదులుగా ప్రజా శాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. కోట్ల రూయాయలకు అమ్ముడుపోయారని కొందరు ముద్రగడపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కాకినాడలో మీకు, మీ కుమారుడికి సీట్లు ఇస్తామని, మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా సైతం ప్రకటిస్తామని ముద్రగడకు కేఏ పాల్ ఆఫర్ చేయడం తెలిసిందే.

ప్రజాశాంతి పార్టీ నేత బాబు మోహన్ మాట్లాడుతూ.. బీజేపీపై ఆరోపణలు చేశారు. బీజేపీ తనను గత 5సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేయించుకుని వ‌దిలేసింద‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానన్న రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ బీజేపీ పరిశీలన లిస్టులో తన పేరు లేకుండానే కేంద్రానికి పంపారని బాబు మోహన్ తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. దేశం బాగుపడాలని నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న కేఏ పాల్ తో కలసి పనిచేయాలని భావించి ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.