Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కి సైతం చెప్పకుండా ముద్రగడ ఏం చేశారంటే ?

ముద్రగడ పద్మనాభం విలక్షణమైన నాయకుడు. మొండితనం పట్టుదల ఆయనకు సహజ లక్షణాలు.

By:  Satya P   |   15 July 2026 10:19 AM IST
ఎన్టీఆర్ కి సైతం చెప్పకుండా ముద్రగడ ఏం చేశారంటే ?
X

ముద్రగడ పద్మనాభం విలక్షణమైన నాయకుడు. మొండితనం పట్టుదల ఆయనకు సహజ లక్షణాలు. తాను అనుకున్నది సాధించేందుకు ఆయన ఎందాకైనా వెళ్ళిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆయన తన రాజకీయ జీవితంలో ఎక్కడా రాజీ పడలేదు, అంతే కాదు తనకు తానే ఒక అధిష్టానం గా భావించేవారు. తన ఆత్మ గౌరవం లేని చోట క్షణ కాలం కూడా ఉండేందుకు ముద్రగడ అంగీకరించేవారు కాదు. ఆయన మాట అంటే శిలా శాసనం. తనను ఎవరూ దేనితోనూ కొనలేరని ఆయన తరచూ చెప్పేవారు. ఇదిలా ఉంటే ముద్రగడ ఎన్టీఆర్ కేబినెట్ లో ఎక్సైజ్ శాఖతో పాటు ఆర్టీసీ శాఖను కూడా చూశారు. ఆ రోజులలో ఎక్సైజ్ శాఖ చాలా కీలకమైనది. ముద్రగడ వంటి నిజాయతీపరుడుకి ఆ శాఖ దక్కింది అని అంతా సంతోషించారు.

చెప్పా చేయకుండా వచ్చేశారు :

ఇదిలా ఉంటే ముద్రగడ తనకు మంత్రి పదవి ఇచ్చినా ఎక్కువ కాలం టీడీపీ ప్రభుత్వంలో ఉండలేకపోయారు. తన మీద ప్రభుత్వంలో కొందరు నిఘా పెడుతున్నారని తనను అనుమానిస్తున్నారు అని ఆయన భావించి ఏకంగా తన మంత్రి పదవికే రాజీనామా చేశారు. అంతే కాదు చెప్పా చేయకుండా ఆయన హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చేసి తన సొంత ఊరు కిర్లంపూడి చేరుకున్నారు. తాను రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లుగా కనీసం ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కి కూడా ఆయన చెప్పలేదు, ఇక హైదరాబాద్ నుంచి వస్తూ మధ్యలో తనకు మంత్రిగా ఇచ్చిన సెక్యూరిటీని కూడా పంపించేసి సాదా సీదా ఎమ్మెల్యేగా కిర్లంపూడికి ఆయన చేరుకున్నారు. దాంతో అంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఆయనకు తిరిగి మంత్రి పదవి ఇవ్వాలని చూసినా వద్దు అంటూనే దూరంగా జరిగారు. తన వ్యక్తిత్వాన్ని అనుమానించారు అన్న కారణంతోనే ఆయన టీడీపీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నట్లుగా అప్పట్లో చెప్పుకున్నారు.

ఎన్టీఆర్ కే మద్దతు అంటూ :

ఇక దాని కంటే ముందు 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు. ఆ సమయంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. ఎన్టీఆర్ వర్గం ఎమ్మెల్యేలు అంతా కర్ణాటకలోనిని నందీ హిల్స్ లో క్యాంప్ లో ఉండేవారు. అందరినీ అక్కడికే రమ్మని పార్టీ పెద్దలు కోరారు. అయితే ఆ సమయంలో ముద్రగడ ఒకే మాట చెప్పారు. తాను మనసా వాచా ఎన్టీఆర్ కే మద్దతు ఇస్తానని కచ్చితంగా ప్రకటించారు. అదే సమయంలో తాను నంది హిల్స్ వంటి క్యాంపులలో ఉండలేనని తెగేసి చెప్పారు. తన మీద నమ్మకం ఉంచాలని ఆయన కోరి మరీ తన సొంత ఊరు కిర్లంపూడి వచ్చేశారు. అన్నట్లుగానే ఆయన ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్టీఆర్ కే బల పరీక్షలో మద్దతుగా నిలిచి అన్న గారిని అసెంబ్లీలో గెలిపించారు. దానిని చూసే ఎన్టీఆర్ మెచ్చుకుని 1985లో రెండవసారి గెలిచిన తరువాత ముద్రగడకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు.

పిఠాపురం అంటే ప్రేమ :

ఇక ముద్రగడకు పిఠాపురం అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఆయన మంత్రిగా పనిచేసే కాలంలో ఎంతో మందికి పిఠాపురం యువతలు ఉద్యోగాలు లభించాయి. దాంతో వారంతా ముద్రగడ అంటే ఆదరణ చూపిస్తారు. ముద్రగడ సైతం ఏ కార్యక్రమం తలపెట్టినా పిఠాపురం నుంచే మొదలెట్టేవారు. ప్రతీ ఏటా కాపుల కార్తీక సమారాధనకు ఆయన హాజరై అందరితో కలసి మెలసి ఉండేవారు. తన అభిమానుల ఇళ్ళకు ఆయన స్వయంగా వెళ్ళి వారిని పలకరించేవారు. మంత్రిగా చేసినా కీలక నేతగా ఉన్నా కూడా జనంతో మమేకం అయి సామాన్యుడిగా ఉండడం ముద్రగడకు ఇష్టం. అందుకే ఆయన పట్ల జనాలు ఆ తీరున స్పందించే వారు అని చెబుతారు.