Begin typing your search above and press return to search.

ముద్రగడ పద్మనాభం ఇక లేరు.. ఆయన మరణానికి కారణమేంటంటే?

2024 ఎన్నికల ముందు ఆయన రాజకీయంగా మరోసారి వార్తల్లో నిలిచారు. తొలుత జనసేనలో చేరతారనే ప్రచారం జరిగినప్పటికీ, అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

By:  A.N.Kumar   |   14 July 2026 9:40 PM IST
ముద్రగడ పద్మనాభం ఇక లేరు.. ఆయన మరణానికి కారణమేంటంటే?
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ నేతగా.. మాజీ మంత్రిగా.. కాపు ఉద్యమానికి ప్రధాన ముఖచిత్రంగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం మంగళవారం కన్నుమూశారు. 73 ఏళ్ల ముద్రగడ గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త వెలువడిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాలు, కాపు సంఘాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

1953 జనవరి 22న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం రాజకీయ కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి ముద్రగడ వీరరాఘవరావు కూడా ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ముద్రగడ 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. అనంతరం మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కాకినాడ లోక్‌సభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి.రామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా కూడా పనిచేశారు.

అయితే ముద్రగడకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది కాపు రిజర్వేషన్ ఉద్యమమే. కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన అనేక నిరాహార దీక్షలు, ఆందోళనలు, పాదయాత్రలు నిర్వహించారు. దశాబ్దాల పాటు సాగిన ఈ ఉద్యమం రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. ముఖ్యంగా 2016లో తుని ఘటన తర్వాత కాపు ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవగా ఆ ఉద్యమానికి ముద్రగడే ప్రధాన నాయకుడిగా నిలిచారు. అనంతరం 2020లో ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ కాపు సమాజంలో ఆయనకు ఉన్న గౌరవం మాత్రం తగ్గలేదు.

2024 ఎన్నికల ముందు ఆయన రాజకీయంగా మరోసారి వార్తల్లో నిలిచారు. తొలుత జనసేనలో చేరతారనే ప్రచారం జరిగినప్పటికీ, అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించలేకపోతే తన పేరును "ముద్రగడ పద్మనాభ రెడ్డి"గా మార్చుకుంటానని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అధికారికంగా తన పేరును మార్చుకోవడం కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.

ఇటీవలి కాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న ముద్రగడ ఆకస్మిక మరణం ఆయన అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన పోరాటం, ప్రజా సమస్యలపై ఆయన చూపిన పట్టుదల, రాజకీయ జీవితంలో అనుసరించిన విలువలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ముద్రగడ పద్మనాభం మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయానికి ముగింపు పలికినట్టైంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్ మీడియాలో వేలాది మంది నివాళులు అర్పిస్తున్నారు. కాపు ఉద్యమ చరిత్రలో ముద్రగడ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.