ఆస్పత్రిలో ముద్రగడ.. సజ్జల పరామర్శ.. ఆగని పొలిటికల్ రచ్చ!
మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభరెడ్డి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
By: Tupaki Political Desk | 26 Jun 2026 11:30 AM ISTమాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభరెడ్డి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర అనారోగ్యం పాలైన ముద్రగడ గత కొంతకాలంగా హైదరాబాద్ ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే ఆయనను వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పరామర్శించేందుకు రాలేదంటూ ముద్రగడ కుమార్తె క్రాంతి నిలదీయడం, ఈ విషయమై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా క్రాంతిపై విమర్శలతో ఎదురుదాడి చేయడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ సీనియర్ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించారు. అయినప్పటికీ జగన్ రాలేదంటూ ప్రత్యర్థులు రచ్చ చేస్తూనే ఉండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
గత ఎన్నికల్లో వైసీపీలో చేరడమే కాకుండా, ఆ పార్టీ తరఫున గట్టిగా పోరాటం చేస్తున్న ముద్రగడకు అధినేత జగన్ విలువ ఇవ్వడం లేదని కుమార్తె క్రాంతి ఆరోపిస్తున్నారు. గంజాయి కేసుల్లో నిందితులను పరామర్శించేందుకు వెళుతున్న జగన్.. తన కోసం పేరు మార్చుకున్న ముద్రగడను పరామర్శించకపోవడంపై ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన వాగ్యుద్ధమే జరుగుతోంది. అయినప్పటికీ వైసీపీ అధికారికంగా స్పందించలేదు. కానీ, సోషల్ మీడియాలో విమర్శలకు చెక్ పెట్టే ఉద్దేశంతో పార్టీ సీనియర్ నేత సజ్జలను పంపిందని అంటున్నారు.
కాగా, ముద్రగడను పరామర్శించేందుకు జగన్ రెడ్డి రాకపోవడమే చర్చనీయాంశం అవుతోంది. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు మంచి పట్టు ఉంది. కాపులను వైసీపీకి దగ్గర చేసేందుకు ఆయన ఎంతో ప్రయత్నించారు. గత ఎన్నికల సమయంలో కాపు ఓట్లతో వైసీపీని గెలిపిస్తానని సవాల్ విసిరారు. వైసీపీ గెలవకుంటే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ముద్రగడ ప్రకటించినట్లుగానే తన పేరు మార్చుకున్నారు. అధికారికంగా గెజిట్ ప్రకటన కూడా చేయించుకున్నారు. ఇలా వైసీపీకి వీరాభిమానిగా మారిపోయిన ముద్రగడ విషయంలో జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన కుమార్తె చేస్తున్న ప్రచారం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది.
ఈ పరిస్థితుల్లో ముద్రగడను పరామర్శించేందుకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. ఆ పార్టీకి దూరంగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా కొద్దిరోజుల క్రితం ముద్రగడ కుటుంబ సభ్యులను కలిసి వచ్చారు. కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇప్పటివరకు స్పందించకపోవడంపైనే విస్తృత చర్చ జరుగుతోందని అంటున్నారు. సమయం చిక్కకే జగన్ రెడ్డి పరామర్శకు వెళ్లలేదా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్న చర్చ జరుగుతోంది. కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్న వైసీపీ అధినేత జగన్ రెడ్డి తన పార్టీలో కీలకంగా పనిచేస్తున్న కాపు నేత విషయంలో ఎందుకు తాత్సార్యం చేస్తున్నారో అంతుపట్టడం లేదని వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. వీలైనంత వేగంగా జగన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లి ముద్రగడను పరామర్శించి విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.
