కాపు నేత ముద్రగడకు క్యాన్సర్.. వైద్యం చేయంచని కుమారుడు! కుమార్తె క్రాంతి ఆరోపణ
ఈ నేపథ్యంలో తండ్రి ఆరోగ్యంపై వాకబు చేసిన క్రాంతి.. తన తండ్రి ముద్రగడ పద్మనాభరెడ్డి క్యాన్సర్ తో బాధపడుతున్నారనే విషయాన్ని వెల్లడించారు.
By: Tupaki Desk | 6 Jun 2025 2:44 PM ISTకాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆయన కుమార్తె, జనసేన మహిళా నాయకురాలు క్రాంతి బయటపెట్టిన సమాచారం ప్రకారం ముద్రగడ క్యాన్సర్ తో కొంత కాలంగా బాధపడుతున్నారట.. అయితే రాజకీయ కారణాల వల్ల ఆయనకు సరైన వైద్యం అందించకుండా కుమారుడు గిరి, ఆయన అత్తమామలు ముద్రగడను నిర్లక్ష్యం చేస్తున్నారని క్రాంతి ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ముద్రగడ హాజరు కావాల్సివుంది. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల తాను రావడం లేదని, కానీ పార్టీ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో తండ్రి ఆరోగ్యంపై వాకబు చేసిన క్రాంతి.. తన తండ్రి ముద్రగడ పద్మనాభరెడ్డి క్యాన్సర్ తో బాధపడుతున్నారనే విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా తన సోదరుడు గిరి తండ్రి ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడని ఆరోపించారు. రాజకీయ కారణాలతో తండ్రి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తాను క్షమించనని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. తన తండ్రిని ఎవరూ కలవకుండా సోదరుడు గిరి నిర్బంధించాడని క్రాంతి తన ట్వీట్ లో ఆరోపించారు. కుటుంబ సభ్యులు, ముద్రగడకు బాగా సన్నిహితులైన వారికి కూడా ఆయన ఆరోగ్యంపై ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని వెల్లడించారు. తన తండ్రిని ఎవరికి చూపకుండా గిరి, ఆయన మామ బంధించారని క్రాంతి చెబుతున్నారు.
తన తండ్రి ఆరోగ్యం విషయమై తెలుసుకుని తాను కలవాలని ప్రయత్నించానని, ఇందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు సహకరించారని వెల్లడించారు. అయితే నాన్న గారెని కలవడానికి సోదరుడు గిరి తనను అనుమతించలేదని వాపోయారు. ‘‘నాన్న ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదు. నాన్నను బంధించి వంటరిగా ఉంచుతున్నారని, ఎవరూ ఆయన దగ్గరికి వెళ్లడానికి, మాట్లాడటానికి అనుమతించడం లేదని నాకు తెలిసింది. గిరి ఇది అమానుషం. ఆమోదయోగ్యం కాదు. మీరు రాజకీయ కారణాల వల్ల ఇలా చేస్తుంటే నాకు కచ్చితంగా స్పష్టంగా చెప్పాలి. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మా నాన్న గారెకి సంరక్షణ అవసరం.’’ అంటూ ట్వీట్ చేశారు క్రాంతి.
2024 సాధారణ ఎన్నికలకు ముందు తండ్రి ముద్రగడతో విభేదిస్తూ క్రాంతి జనసేనకు మద్దతు పలికారు. తునిలో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే రాజకీయం కోసం తాను కుటుంబాన్ని విడదీయనని అప్పట్లో క్రాంతి చేరికను తిరస్కరించిన పవన్.. ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక జనసేనలోకి క్రాంతిని ఆహ్వానించారు. అదే సమయంలో జనసేనలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ముద్రగడ.. వైసీపీ నుంచి పిలుపుతో అటు వైపు మళ్లారు. చాలా కాలం పాటు రాజకీయంగా విశ్రాంతి తీసుకున్న ముద్రగడ వైసీపీలో చేరిన తర్వాత జనసేనాని పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అంతేకాకుండా పవన్ గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి, ఫలితాలు వచ్చాక లీగల్ గా పేరు మార్చుకున్నారు.
కాపు నేతగా గోదావరి జిల్లాలో ముద్రగడ ప్రభావం ఉంటుందని వైసీపీ విశ్లేషించింది. ఆయన కుమారుడిని ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించింది. అయితే ముద్రగడ కుమార్తె క్రాంతి ట్వీట్ ద్వారా ఆయన ఆరోగ్యం క్షీణించిందనే విషయం బయటపడింది. ఈ సమాచారంతో ముద్రగడ అనుచరులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థిస్తున్నారు.
