Begin typing your search above and press return to search.

ముద్రగడ మీద జనసేన బాణంగా ఆమె!

ఈ పరిణామంలో ఆయన ఎత్తు పల్లాలను సైతం చూశారు. మంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన ముద్రగడ గత పాతికేళ్ళుగా మాత్రం ఏ పదవినీ చేపట్టలేకపోయారు.

By:  Tupaki Desk   |   10 July 2025 10:07 PM IST
ముద్రగడ మీద  జనసేన బాణంగా ఆమె!
X

దాదాపుగా ఏడు పదుల వయసులో ఉన్న ముద్రగడ పద్మనాభం గురించి రాష్ట్ర రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. ఆయన నీతి నిజాయితీలకు మారు పేరుగా చెబుతారు. అంతే కాదు పట్టుదలకు పెట్టింది పేరుగానూ చెబుతారు. ముద్రగడ అంటేనే ఉద్యమం అన్నట్లుగా ఆయన మారి కొంతకాలం పాటు కాపుల కోసం పనిచేశారు. వారికి రిజర్వేషన్లు రావాలని తన రాజకీయ జీవితాన్నే ఫణంగా పెట్టారు.

ఆయన గోదావరి జిల్లాలకు చెందిన వారు అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను సైతం శాసించారు. ఉమండి ఏపీలో ఆనాటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వారే ముద్రగడ దీక్షను చూసి కాపులకు రిజర్వేషన్లు ఇస్తూ జీవో కూడా ఇచ్చారు. అలా కాపుల కోసం అన్నట్లుగా ముద్రగడ పనిచేశారు.

ఈ పరిణామంలో ఆయన ఎత్తు పల్లాలను సైతం చూశారు. మంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన ముద్రగడ గత పాతికేళ్ళుగా మాత్రం ఏ పదవినీ చేపట్టలేకపోయారు. ఇ 2014లో చంద్రబాబుతో తలపడి కాపుల కోసం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే అని గర్జించిన ముద్రగడ ఆ మీదట జరిగిన తుని రైలుకు కొందరు నిప్పంటించిన ఘటనలో కేసులను కూడా ఎదుర్కొన్నారు.

ఇలా కాపుల కోసం పోరాడిన ఆయన కొంతకాలంగా ఆ ఉద్యమం నుంచి తప్పుకున్నారు. ఇక ఆయన రాజకీయ జీవితంలో కూడా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన 2024 ఎన్నికలను ఫోకస్ చేశారు. జనసేనలో చేరాలని మొదట చూశారు. ఆయనను చేర్చుకోవడానికి పవన్ సైతం అంగీకరించారు. అయితే మధ్యలో ఏమైందో ఏమో కానీ ముద్రగడ మనసు మార్చుకుని పవన్ మీద విమర్శల జోరు పెంచారు. ఈ క్రమంలో ఆయనను వైసీపీ ఆహ్వానించింది.

అలా ఆయన వైసీపీలో చేరి 2024 లో పిఠాపురంలో పవన్ ని ఓడిస్తాను లేకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటాను అని సవాల్ చేశారు. పవన్ భారీ మెజారిటీతో గెలవడంతో ఆయన తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. మరో వైపు ముద్రగడ కుమార్తె క్రాంతి తండ్రికి ఎదురు నిలిచారు 2024 ఎన్నికల్లో ఆమె బాహాటంగా జనసేనకు మద్దతు ప్రకటించారు.

ఆ తరువాత ఈ మధ్య మళ్ళీ ఆమె రాజకీయ తెర మీదకు వచ్చారు. తన తండ్రికి క్యాన్సర్ వస్తే తన సోదరుడు అత్త వారు అంతా కలసి వైద్యం చేయించడం లేదని భారీ విమర్శలే చేశారు. దానికి ముద్రగడ కౌంటర్ ఇచ్చారు. తన ఆరోగ్యం బాగానే ఉందని కుమార్తె తన గడప తొక్కనక్కరలేదని కూడా స్పష్టం చేసారు.

ఈ క్రమంలో ముద్రగడ సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులో వైసీపీ ఇంచార్జి గా ముద్రగడ కుమారుడు గిరిని ఆ పార్టీ నియమించింది. ఇపుడు అక్కడ క్రాంతి పర్యటనలు చేస్తున్నారు. జనసేన నాయకురాలిగా ఆమె జోరు పెంచుతున్నారు. ప్రత్తిపాడు జనసేన ఇంచార్జి పదవిని ఆమెకు ఇస్తారని అలా అటు వైసీపీకి ఇటు ముద్రగడకు ఒకేసారి చెక్ పెట్టవచ్చు అన్నది జనసేన ఆలోచనగా ఉందిట. దీంతో తొందరలోనే ఈ నియామకం జరుగుతుందని అంటున్నారు.

అదే కనుక జరిగితే ముద్రగడ ఇంట్లోని రచ్చ కాస్తా రాజకీయ రచ్చగా మారుతుందని అంటున్నారు. ముద్రగడ తన కుమారుడి గెలుపు కోసం ఎటూ ప్రత్తిపాడు రావాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రత్యర్థిగా కుమార్తె ఉంటే ముద్రగడ ఏమి చెప్పినా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఇక పొత్తులలో భాగంగా 2029లో ముద్రగడ క్రాంతి జనసేన నుంచి పోటీ చేస్తుందని అంటున్నారు. ఇటు ముద్రగడ గిరి పోటీకి దిగితే అక్కా తమ్ముళ్ల పోరు మధ్యన ముద్రగడ నలిగిపోతారని అంటున్నారు. వృద్ధాప్య దశలో ఆయనకు ఈ కష్టాలు మంచివేనా అన్న చర్చ మాత్రం జరుగుతోంది. ముద్రగడ అనుచరులు రెండుగా చీలిపోతే ప్రత్తిపాడులో ఆ ఎఫెక్ట్ వైసీపీ మీద కూడా పడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.