కాన్సరూ లేదూ పాడూ లేదు...వారితో జన్మ విరోధమే !
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం(రెడ్డి) తాజాగా సంచలన లేఖ రాశారు.
By: Tupaki Desk | 9 Jun 2025 3:27 PM ISTతనకు క్యాన్సర్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని కుమార్తె క్రాంతి అల్లుడు వారి కుటుంబం మీద మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్నమాభం రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన సోమవారం కిర్లంపూడిలోని తన ఇంట్లో తెలుగు ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాసి విడుదల చేశారు. ఆ లేఖలో ఆయన అనేక సంచలన వ్యాఖ్యలు చేసారు. తన కుమార్తెతో ఏడాదిగా మాటా మంతీ లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇక ఈ జన్మలో వారితో కలిసేది లేదని కుండబద్ధలు కొట్టారు. తన చిన్న కుమారుడు గిరి రాజకీయ ఎదుగుదలను చూడలేకనే కుమార్తె సహా ఆ కుటుంబం వారు తమ మీద అసూయతో విమర్శలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు తాను ఆరోగ్యంగా ఉండడానికి కుమారుడు గిరి కారణం అన్నారు.
తన కుమారుడికీ తనకు మధ్య చిచ్చు పెడితే తాను కుమార్తె ఇంటికి వెళ్తానన్నది వారి ఆలోచన అని ఆయన అంటూ అది ఈ జన్మలో జరగదని ముద్రగడ స్పష్టం చేశారు. తమ కుటుంబానికి కుమార్తె కుటుంబానికి చాలా కాలంగా విభేదాలు ఉన్నాయని ఆయన చెప్పడం విశేషం.
ఇక ఏడాది కాలంగా చూస్తే రాకపోకలు అన్నీ కూడా పూర్తిగా బంద్ అయ్యాయని అన్నారు. నేను వారి జోలికి అసలు పోవడం లేదు కానీ వారే మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, ఒక కుటుంబం మీద మరో కుటుంబం దాడి చేస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఆఖరుకు ఇది ఎంతదాకా వచ్చింది అంటే తనకు క్యాన్సర్ వచ్చిందని తన చిన్న కుమారుడు గిరి ఎంతమాత్రం తనను పట్టించుకోవడం లేదని ఆయన మామగారు అంతా కలసి తనను బంధించారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని కుమార్తె మీద మండిపడ్డారు. మీ అడుగులకు మడుగులు ఒత్తుతాను అనుకుంటున్నారేమో అది ఎన్ని జన్మలు ఎత్తినా జరిగే పని కాదని ముద్రగడ తమ కుమార్తె కుటుంబానికి స్పష్టం చేశారు.
గతంలో తన భార్యకు అనారోగ్యం వచ్చినపుడు హైదరాబాద్ లో ఆపరేషన్ చేసుకుని కుమార్తె ఇంటికి వెళ్తే ఇంటి నుంచి బయటకు పంపించిన సంగతి మీరు మరచిపోయారా అని కుమార్తె కుటుంబన్ని ముద్రగడ ప్రశ్నించారు. ఇపుడు మీ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఆయన అన్నారు.
ఇక తనకు వయసు రిత్యా వచ్చే సమస్యలు తప్ప మరేమీ లేవని ముద్రగడ పేర్కొన్నారు. తాను ప్రతీ రోజూ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నాను అని ఆయన గుర్తు చేశారు. తన కోసం వచ్చిన అభిమానులకు ప్రజలను కలుస్తున్నాను అని ముద్రగడ చెప్పారు. ఇక తనను బంధించడం హింసించాలనుకోవడం ఎవరి తరం కానే కాదని ఆయన చెప్పారు.
తన మీద తుని దహనం కేసులను తిరిగతోడకుండా ఆపించిన ఘనత తమదేనని కుమార్తె ఆమె కుటుంబం వారు చెప్పుకోవడం పట్ల ముద్రగడ ఎద్దేవా చేశారు. మీకు దమ్ముంటే కాపులను బీసీలలో చేర్పించి అపుడు మాట్లాడాలని ఆయన సవాల్ చేసారు. చంద్రబాబు వద్ద నిజంగా పలుకుబడి ఉంటే సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని కూడా ఆయన సెటైర్లు వేశారు.
కుమార్తె ఆమె కుటుంబానికే అంత రాజకీయ హవా ఉంటే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ల పరిస్థితి ఏమిటని ముద్రగడ ప్రశ్నించారు. చీప్ పబ్లిసిటీ కోసం తన కుమార్తె ఆమె కుటుంబం పాకులాడుతోంది అని ముద్రగడ ఫైర్ అయ్యారు.
