ముద్రగడ మనవడు తొలి కాపు సీఎం అవుతారా ?
కాపు నేతగానే ముద్రగడ పద్మనాభం రెడ్డికి పేరుంది. ఆయన రాజకీయ జీవితం దాదాపుగా యాభై ఏళ్ళు అంటే అందులో మూడు దశాబ్దాలకు పైగా కాపుల ఉద్యమం కోసమే అంకితం చేశారు.
By: Tupaki Desk | 10 Jun 2025 9:20 AM ISTకాపు నేతగానే ముద్రగడ పద్మనాభం రెడ్డికి పేరుంది. ఆయన రాజకీయ జీవితం దాదాపుగా యాభై ఏళ్ళు అంటే అందులో మూడు దశాబ్దాలకు పైగా కాపుల ఉద్యమం కోసమే అంకితం చేశారు. ఆయన తలుచుకుంటే ఈ రోజుకీ ఉప ముఖ్యమంత్రి దాకా పదవులు దక్కేవి.
అంతే కాదు కాపులను కనుక తన రాజకీయానికి వాడుకోవాలని చూస్తే కనుక ముఖ్యమంత్రి పీఠానికే గురి పెట్టి ఉండేవారు. కానీ ఆత్మాభిమానం పట్టుదల నిండుగా ఉన్న ముద్రగడ రాజకీయ పదవులను ఎపుడూ వద్దు అనే అనుకుని దూరంగా ఉండిపోయారు.
ఆయన తన సామాజిక వర్గం కాపులను బీసీలలో కలపాలని కోరుతూ మూడు దశాబ్దాలకు పైగా ఉద్యమిస్తున్నారు. దానికి కారణం ఉంది. 1966 దాకా ఏపీలో కాపులు బీసీలుగా ఆ జాబితాలో ఉండేవారు. కానీ ఆ తరువాత దానిని రద్దు చేసి కాపులను ఓసీలుగా మార్చేశారు.
దాంతో ఈ డిమాండ్ అప్పటి నుంచి ఉన్నా ముద్రగడ లాంటి ఒక ఫోకస్ కలిగిన పొలిటీషియన్ చేతిలో పడేవరకూ ఆ డిమాండ్ ఏపీ జనాల దాకా రాలేదు. ఆ మాటకు వస్తే పాలకుల చెవిన కూడా సోకలేదు. మొత్తానికి చూస్తే ముద్రగడ కాపులను బీసీలలో చేర్చలేకపోవచ్చు కానీ ఆ జాతిలో ఒక ఆవేదన ఆక్రందన ఉందని వారిలో అణగారిన బాధ ఎంతో ఉందని అందరికీ అర్ధం అయింది.
అలా చేయడంతో ముద్రగడ సక్సెస్ అయ్యారు. ఇక కాపులను బీసీలలో చేరుస్తారో లేదో అన్నది ముందు కాలం నిర్ణయిస్తుంది ఇదిలా ఉంటే కాపులలో మరో దీర్ఘకాలికమైన కోరిక ఉంది. తమ జాతి నుంచి ముఖ్యమంత్రి ఒకరు కావాలని. ఎంతో మంది దిగ్గజ నేతలు కాపు సామాజిక వర్గంలో ఉన్నా వారంతా ఉప ముఖ్యమంత్రి దాకా వెళ్ళగలిగారు కానీ సీఎం కాలేకపోయారు.
ఆఖరుకి ఎంతో ఆశలు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే ఉప ముఖ్యమంత్రి స్థానం వద్దనే నిలిచి ఉన్నారు. ఆయన చంద్రబాబునే మరో పదిహేనేళ్ళ పాటు సీఎం గా ఉండమని కోరుతున్నారు. ఏపీ అభివృద్ధి తనకు ముఖ్యమని పవన్ చెబుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాపులకు ముఖ్యమంత్రి అందని పండేనా అన్న చర్చ సాగుతోంది. సరిగ్గా ఈ సమయంలో ముద్రగడ నోటి వెంట ఒక మాట వచ్చింది. ఆయన పట్టుదలతో అన్నారో లేక యాధృచ్చికంగా అన్నారో తెలియదు కానీ తన మనవడిని ముఖ్యమంత్రిని చేస్తాను అని ప్రకటించారు.
ఆయన తన కుమారుడు గిరి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసే పనిలో ఉన్నారు. తన కుమారుడు గిరి ఎమ్మెల్యే కావాలని మంత్రి కావాలని కోరుకుంటున్నారు. బహుశా 2029లో గిరి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా కావచ్చు. వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రిగా కూడా కావచ్చు.
అయితే తన కుమారుడు గిరిని రాజకీయ వారసుడిగా ప్రకటించి ఆయన కోసం ఎంతో కృషి చేస్తున్న ముద్రగడ ముఖ్యమంత్రిగా కుమారుడిని చూడాలని అనుకోవడం లేదు. తన మనవడిని ముఖ్యమంత్రిని చేస్తాను అని అంటున్నారు. అంటే గిరి కుమారుడు అన్న మాట.
ఈ రోజు చిన్న వారిగా ఉన్నా వారిని రాజకీయాల్లోకి తెచ్చి మరో రెండు దశాబ్దలా తరువాత అయినా ఏపీకి సీఎం గా వారు చేయాలని తాను చూడాలని బలంగా ముద్రగడ కోరుకుంటున్నారు. మరి ముద్రగడ కోరిక నెరవేరేది ఏ పార్టీలో అన్నది అయితే చెప్పలేదు.
అదే సమయంలో ఆయన కొందరు తన కుమారుడి రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారని కుమార్తె క్రాంతి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే దూకుడు స్వరంతో నా మనవళ్లను, మనవరాళ్లను కూడా రాజకీయాల్లోకి దింపుతాను. వాళ్లను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళతానని ముద్రగడ సంచలన ప్రకటన చేశారు. తన కుమారుడికి తనకు మధ్య విభేదాలు సృష్టించాలనే ప్రయత్నాలు మానుకోవాలని కుమార్తెకి ఆయన హితవు పలికారు.
మొత్తానికి కాపులకు ఈ రోజు దాకా ముఖ్యమంత్రి లేరు. ఆ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అవుతామని ఎవరూ క్లెయిం చేసుకోవడం కూడా లేదు. కానీ రాజకీయాల వాసన కూడా తెలియని ముద్రగడ మనవళ్ళను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇప్పించి ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పడం ద్వారా కాపులలో తమ కుటుంబం నుంచి ముఖ్యమంత్రి వస్తారని స్పష్టం చేశారని అంటున్నారు. ఒక విధంగా ఆవేశంతో మాట్లాడినా కూడా ముద్రగడ తన ప్రకటనల ద్వారా జనసేనకు సీఎం చాన్స్ లేదని తేల్చేశారా అన్న చర్చ కూడా వస్తోంది.
