'కెప్టెన్ కూల్'.. ఎంఎస్ ధోని కొత్త బిజినెస్
టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పుడు క్రికెట్ బాట తప్పి వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు
By: Tupaki Desk | 30 Jun 2025 7:21 PM ISTటీమ్ ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పుడు క్రికెట్ బాట తప్పి వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 'కెప్టెన్ కూల్'గా గుర్తింపు పొందిన ధోనీ, అదే పేరును ఇప్పుడు అధికారికంగా తన ట్రేడ్‌మార్క్‌గా రిజిస్టర్ చేసుకునే పనిలో ఉన్నారు.
ధోనీ 'కెప్టెన్ కూల్' అనే ట్రేడ్‌మార్క్ కోసం 2023 జూన్ 5న అధికారికంగా దరఖాస్తు చేసుకున్నారు. క్రికెట్ అభిమానుల నోళ్లలో ఎప్పుడూ వినిపించే ఈ పేరును తన కొత్త వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించేందుకు ధోనీ ముందడుగు వేశారు. ఈ ట్రేడ్‌మార్క్ కోసం మరికొంతమంది కూడా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ప్రాథమిక పరిశీలనలో ధోనీ దరఖాస్తుకే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ట్రేడ్‌మార్క్‌కు సంబంధించి ఫైనల్ రిజిస్ట్రేషన్ దశలో ఉన్న అధికారులు అభ్యంతరాల కోసం పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ధోనీకి 'కెప్టెన్ కూల్' అన్న పేరు మీద సంపూర్ణ హక్కు లభించనుంది.
ఇది ధోనీ వ్యాపార ప్రస్థానానికి ఒక కీలక అడుగు అని చెప్పొచ్చు. ఇప్పటికే అనేక బిజినెస్ వెంచర్లలో దూసుకుపోతున్న ధోనీ, స్పోర్ట్స్‌వేర్, జిమ్ యాక్సెసరీస్, లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్ వంటి విభాగాల్లో 'కెప్టెన్ కూల్' బ్రాండ్ పేరుతో వస్తువులను లాంచ్ చేయనున్నారు అనే సమాచారం బయటకు వచ్చింది.
- ధోనీ వ్యాపార రంగంలోకి ఎందుకు?
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కూడా ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తన ప్రశాంత స్వభావం, నిర్ణయాలలో స్పష్టత, ఒత్తిడిలో కూడా చల్లగా వ్యవహరించగల సామర్థ్యం వల్లే 'కెప్టెన్ కూల్' అనే బిరుదు ఆయనకు వచ్చింది. అదే పేరుతో బ్రాండ్‌గా మారితే, అది మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టడం ఖాయం.
మహేంద్ర సింగ్ ధోనీ 'కెప్టెన్ కూల్' పేరుతో కొత్త రంగాల్లో అడుగుపెడుతుండటం ఆయన అభిమానులను మాత్రమే కాక, వ్యాపార వర్గాలను కూడా ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ బ్రాండ్ మార్కెట్‌లోకి రావడం ఖాయమని తెలుస్తోంది. గతంలో క్రికెట్ గ్రౌండ్‌లపై ఎలా జెండా పాతారో, ఇప్పుడు వ్యాపార రంగంలోనూ అదే శైలిలో విజయాలు సాధించేందుకు ధోనీ సిద్ధమవుతున్నారు!
