Begin typing your search above and press return to search.

భారత్‌లో మిస్టర్ బీస్ట్ లంబోర్గినికి ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు

మిస్టర్ బీస్ట్ నిర్వహిస్తున్న లంబోర్గిని ఛాలెంజ్‌లో భారత్‌లో ప్రమాదం జరిగింది. ప్రపంచ పర్యటనలో ఉన్న ఆరెంజ్ రంగు లంబోర్గిని ఓ బైక్‌ను ఢీకొనడంతో కారు ఎడమవైపు దెబ్బతింది. 66 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి వస్తే కారు సొంతమయ్యే ఈ ఛాలెంజ్‌లో జిమ్, మోనికా పాల్గొన్నారు. ప్రమాదం తర్వాత కూడా ప్రయాణం కొనసాగించి ఇటలీలో టూర్ పూర్తి చేశారు.

By:  Tupaki Desk   |   29 Nov 2026 9:15 PM IST
భారత్‌లో మిస్టర్ బీస్ట్ లంబోర్గినికి ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు
X

యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ నిర్వహిస్తున్న లంబోర్గిని ఛాలెంజ్‌లో భారత్ దగ్గర ఓ ప్రమాదం జరిగింది. ప్రపంచ పర్యటనలో ఉన్న ఆరెంజ్ రంగు లంబోర్గిని ఓ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ఎడమవైపు భాగం దెబ్బతింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మిస్టర్ బీస్ట్ తన తాజా వీడియోలో చూపించాడు.

జిమ్, మోనికా అనే ఇద్దరు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. 66 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి రావాలన్నది వారికి ఇచ్చిన టాస్క్. ప్రయాణం పూర్తిచేస్తే లంబోర్గిని వారికే సొంతమవుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాలు తిరిగిన వీరికి భారత్‌లో ఈ అనుభవం ఎదురైంది.

బైక్ ఢీకొన్న తర్వాత కారు పరిస్థితిని చూసిన జిమ్ అసహనం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు ఆసియా అంతటా తిరిగినా కారుపై ఒక్క గీత కూడా పడలేదని, భారత్‌లో మాత్రం ఇలా జరిగిందని చెప్పాడు. కారు బాడీపై గీతలతో పాటు ఓ చోట రంధ్రం కూడా వీడియోలో కనిపించింది.

అయితే బైక్‌ను ఎవరు నడుపుతున్నారు? ప్రమాదం ఎలా జరిగింది? అనే వివరాలు వీడియోలో పూర్తిగా తెలియలేదు. దీంతో ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదం జరిగినా జిమ్, మోనికా ప్రయాణాన్ని మధ్యలో ఆపలేదు. తమ టూర్‌ను కొనసాగించి ఇటలీకి చేరుకున్నారు. అక్కడ ఛాలెంజ్ పూర్తి చేశారు. ఈ ప్రయాణం చివర్లో జిమ్ మోనికాకు ప్రపోజ్ చేయడం కూడా వీడియోలో కనిపించింది.