Begin typing your search above and press return to search.

మోదీ సభకు డుమ్మా.. కాంగ్రెస్ లో చేరేందుకేనా?

ఎంపీ సోయం బాపూరావు కూడా సభకు హాజరు కాకపోవడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:40 PM GMT
మోదీ సభకు డుమ్మా.. కాంగ్రెస్ లో చేరేందుకేనా?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పుంజుకునే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా రాష్ట్రంలో ప్రధాని మోదీ సభలో పాల్గొనడంతో పార్టీకి జోష్ వచ్చిందనే భావిస్తున్నారు. ఈ జోరుతోనే బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించాలని చూస్తోంది. కానీ పార్టీలోని కొంతమంది నేతల తీరు మాత్రం అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సభ కోసం ప్రధాని మోదీ వచ్చినా.. బీజేపీలోని కొంతమంది తెలంగాణ నాయకులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీ సోయం బాపూరావు కూడా సభకు హాజరు కాకపోవడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీ తెలంగాణలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారని కొంత కాలంగా చర్చ సాగుతోంది. బీజేపీ లో ప్రాధాన్యత దక్కడం లేదని కొంతమంది నాయకులు రహస్య సమావేశం పెట్టడం కలకలం రేపిన విషయం విదితమే.

తాజాగా మోదీ సభకు ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు కొంతమంది సీనియర్ నేతలు ఎక్కడా కనిపించలేదు. పార్టీ అగ్రనేత, ప్రధాని వస్తే కూడా రానంత బిజీగా ఈ నేతలు ఎందుకు ఉన్నారన్నది ప్రశ్నగా మారింది. కావాలనే సభకు వీళ్లు రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ఇతర పార్టీలో నుంచి కాంగ్రెస్ లో కొంతమంది నాయకులు చేరారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కోసమే బీజేపీ పని చేస్తోందనే అభిప్రాయాలు బలంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పట్ల బీజేపీ కఠిన వైఖరి అవలంబించడం లేదని, వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా సీరియస్ గా ప్రయత్నించడం లేదనే సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలెట్టారనే టాక్ వినిపిస్తోంది. అందుకే రహస్యంగా సమావేశాలు పెడుతున్నారని, మోదీ సభకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నాయకులంతా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ తో వీళ్లు టచ్ లోకి కూడా వెళ్లారని తెలుస్తోంది.