Begin typing your search above and press return to search.

దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌: టికెట్ ఇవ్వ‌లేదని.. పురుగుల మందు తాగిన‌ ఎంపీ

ఆరుగాలం శ్ర‌మించి పండించిన పంట చేతికి అంద‌లేద‌న్న దిగులుతో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతులకు కొద‌వ‌లేదు

By:  Tupaki Desk   |   25 March 2024 6:49 AM GMT
దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌: టికెట్ ఇవ్వ‌లేదని.. పురుగుల మందు తాగిన‌ ఎంపీ
X

ఆరుగాలం శ్ర‌మించి పండించిన పంట చేతికి అంద‌లేద‌న్న దిగులుతో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతులకు కొద‌వ‌లేదు. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివినా..పాస్ కాలేక పోయాన‌న్న దిగులుతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విద్యార్థులూ ఉన్నారు. ఇక‌, అప్పుల పాలై.. కుటుంబాన్ని పోషించ‌లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవులు కూడా ఉన్నారు. కానీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో టికెట్ రాలేద‌ని.. ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన నాయ‌కుడిని ఎక్క‌డైనా చూశామా? పైగా ఆయ‌న సిట్టింగ్ ఎంపీ కూడా కావ‌డం విశేషం. ఆయ‌నే త‌మిళ‌నాడుకు చెందిన ఈరోడ్‌నియోజ‌క‌వ‌ర్గం ఎంపీ ఏ. గ‌ణేశ మూర్తి. పోనీ.. ఈయ‌నేమ‌న్నా.. యువ‌కుడా అంటే కాదు. ఏకంగా 74 సంవ‌త్స‌రాల వ‌య‌సు.

అంతేకాదు.. వ‌రుస‌గా 40 ఏళ్ల‌కుపైగానే రాజ‌కీయాల్లో ఉన్నారు. రెండు సార్లు ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకుని అనేక ప‌ద‌వులు అనుభ‌వించారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న‌కు టికెట్ రాలేదు. దీంతో ఏకంగా పురుగుల మందు తాగి.. ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించారు. ప్ర‌స్తుతం గ‌ణేశ‌మూర్తి ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. బ‌హుశ ఈ వార్త చ‌దివే స‌మ‌యానికి ఆయ‌న మృతి చెంది ఉండొచ్చుకూడా!

ఏం జ‌రిగింది?

త‌మిళ‌నాడుకు చెందిన ఎండీఎంకే పార్టీలో కీల‌క నేత‌గా ఉన్న ఈరోడ్ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీ ఎ. గణేశమూర్తికి ప్ర‌స్తుత లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించారు. ఎండీఎంకే ప్ర‌స్తుతం అధికార పార్టీ డిఎంకేతో చేతులుక‌లిపింది. దీంతో పొత్తులో భాగంగా కొన్నిసీట్లు త్యాగం చేశారు. ఈ క్ర‌మంలోనే ఈరోడ్ పార్ల‌మెంటు స్థానానికి అధికార పార్టీ డీఎంకే యువజన విభాగం నాయకుడు కె.ఇ. ప్ర‌కాష్‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఈయ‌న‌కు భారీ మ‌ద్ద‌తు ఉంది. ఏకంగా ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు ప్ర‌కాష్‌ సన్నిహితుడు. దీంతో ప్రకాష్ కు టికెట్ ఇచ్చారు.

ఈ ప‌రిణామాలను జీర్ణించుకోలేక పోయిన గ‌ణేశ మూర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న‌ పురుగుల మందు తాగాడ‌ని కుటుంబ స‌భ్యులు చెప్పారు. ప్ర‌స్తుతం ఐసియులో ఉన్నాడని చెప్పారు. ఎండీఎంకే అధినేత వైకో.. ఈరోడ్ నుండి తిరుచ్చికి సీటు మార్చాలని డిఎంకెను అభ్యర్థించ డంతో, దానిని తన కుమారుడు దురై వైకోకు కేటాయించడంతో గణేశమూర్తిని తప్పించారు. గణేశమూర్తికి టికెట్ నిరాకరించడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే దేశంలోనే ఇలా టికెట్ ద‌క్క‌ని ఓ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

2009, 2019లో రెండు సార్లు గ‌ణేశ మూర్తి ఈరోడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌తంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. మంత్రిగా కూడా ప‌నిచేశారు. అయితే.. ప‌ద‌వీ లాల‌స పోలేద‌న‌డానికి ఆయ‌న ఆత్మ‌హ‌త్యా య‌త్న‌మే నిద‌ర్శ‌నంగా మారింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సానుభూతి మాట ఎలా ఉన్నా 74 ఏళ్ల వ‌య‌సులో టికెట్ కోసం ఆత్మ‌హ‌త్యయత్నం చేయడం స‌రికాద‌నే వాద‌న వినిపిస్తోంది.