Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేగా కాదు.. మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తా: వైసీపీ ఎంపీ క్లారిటీ!

కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరు) వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ బందరు నుంచే ఎంపీగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   10 Sept 2023 12:30 AM
ఎమ్మెల్యేగా కాదు.. మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తా: వైసీపీ ఎంపీ క్లారిటీ!
X

కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరు) వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ బందరు నుంచే ఎంపీగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. ఇటీవల ఆయనను గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలోకి దించుతారని వార్తలు వచ్చాయి. కొడాలి నానిని పక్కనపెట్టి గుడివాడలో బాలశౌరికి చాన్సు ఇస్తారని టాక్‌ నడిచింది. అందులోనూ కొత్తగా పింఛనుకు ఎంపికైన లబ్ధిదారులకు పింఛన్లు అందించే కార్యక్రమం గుడివాడలో జరిగింది. సాధారణంగా ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయిన కొడాలి నాని పాల్గొనాల్సి ఉండగా ఆయన హాజరుకాలేదు. ఆయనకు బదులుగా వల్లభనేని బాలశౌరి హాజరయ్యారు. దీంతో బాలశౌరి పోటీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కాగా వల్లభనేని బాలశౌరి తొలిసారి 2004లో కాంగ్రెస్‌ తరఫున తెనాలి నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో తెనాలి పార్లమెంటు నియోజకవర్గం రద్దు కావడంతో ఆ ఎన్నికల్లో నరసరావుపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి చేతిలో కేవలం 1607 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఇక 2014 ఎన్నికల్లో బాలశౌరి గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ 2019 ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న బందరు లోక్‌ సభా నియోజకవర్గంలో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణపై బాలశౌరి విజయం సాధించారు.

కాపు సామాజికవర్గానికి చెందిన వల్లభనేని బాలశౌరికి పలు పరిశ్రమలు, విద్యా సంస్థలు ఉన్నాయి. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి బాలశౌరి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బాలశౌరి అసెంబ్లీకి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అందులోనూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తో అత్యంత సన్నిహిత సంబంధాల నేపథ్యంలో బాలశౌరి అడిగిన సీటు జగన్‌ కాదనరని టాక్‌ నడుస్తుంది.

వచ్చే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానికి అంత ఆశాజనకమైన పరిస్థితులు లేవని జగన్‌ చేయించిన సర్వేలో తేలిందని.. ఈ నేపథ్యంలో కాపులు ఎక్కువ ఉన్న గుడివాడలో బాలశౌరి అయితే ఫలితం ఉంటుందని.. ఆయనను పోటీ చేయించాలని జగన్‌ నిశ్చయించినట్టు టాక్‌ నడిచింది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం బాలశౌరి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారని అంటున్నారు.

అయితే ఈ వార్తలకు వల్లభనేని బాలశౌరి తెరదించారు. తాను వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున బందరు పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. దీంతో బాలశౌరి గుడివాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారనే వార్తలకు చెక్‌ పడింది.