కాకినాడ జనసేన ఎంపీకి సైబర్ ఝలక్.. 11 సార్లు మెసేజ్ చేసి రూ.92 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
ఇటీవల ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఖాతాలను తనిఖీ చేయడంతో మోసం వెలుగు చూసింది. వెంటనే హైదరాబాదులోని సైబర్ క్రైం పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేశారు.
By: Tupaki Desk | 11 Sept 2025 3:21 PM ISTసైబర్ నేరస్తులు ఎవరినీ విడిచిపెట్డం లేదు. అధికారం, అవకాశం ఉన్నవారిని సౌతం బురిడీ కొట్టిస్తున్నారు. కోట్లు కొల్లగొడుతున్నారు. ఎవరినైనా దోచేస్తామని సంకేతాలిస్తున్న సైబర్ నేరగాళ్లు.. కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు ఝలక్ ఇచ్చారు. ఆయన ఫొటో వాడి ఏకంగా రూ.92 లక్షలు విడతలు వారీగా కొల్లగొట్టారు. ఎంపీకి చెందిన వ్యాపర సంస్థ మేనేజర్ కు ఏకంగా 11 సార్లు మెసేజ్ చేసి మోసం చేశారు.
కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు ‘టీటైమ్’ అనే వ్యాపర సంస్థ ఉంది. దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు నడిపే టీ టైమ్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో పనిచేస్తుంది. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న మేనేజర్ ను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.92.5 లక్షలు దోచుకున్న ఉదంతం సంచలనంగా మారింది. ఎంపీ ఫొటో వాడుకుని 11 సార్లు మెసేజ్ చేసినా మేనేజర్ గుర్తించకపోవడం విశేషం. ప్రతి సారి ఎంపీ పేరు, ఫొటో వాడుకోవడం, అచ్చంగా ఎంపీ చేసినట్లే మెసేజ్ చేయడం వల్ల నేరస్తులు అడిగినంత మొత్తం బదిలీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఖాతాలను తనిఖీ చేయడంతో మోసం వెలుగు చూసింది. వెంటనే హైదరాబాదులోని సైబర్ క్రైం పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం గత నెల 22న హైదరాబాద్ లోని టీ-టైమ్ చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ గంగిశెట్టి శ్రీనివాసరావు ఫోన్ కు ఓ వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ నెంబరు ఎంపీ శ్రీనివాస్ ది కానప్పటికీ, దాని డీపీగా ఎంపీ ఫొటో ఉంది. అంతేకాకుండా ‘‘నేను ఎంపీ శ్రీనివాస్ ను. కొత్త నెంబరును ఉపయోగిస్తున్నా.. ఇప్పుడు నాకు అత్యవసరం కొంత మొత్తం పంపించు’’ అని మెసేజ్ వచ్చింది. దీంతో తమ యజమాని ఎంపీ శ్రీనివాస్ ఆ మెసేజ్ చేశారని భావించి కొంత మొత్తం పంపించారు ఫైనాన్స్ మేనేజర్.
అయితే సైబర్ నేరస్తులు అనుకున్నట్లే టీ.టైమ్ మేనేజర్ వారి బుట్టలో పడటంతో దఫదఫాలుగా దోపిడీకి దిగారు. సుమారు 11 సార్లు మెసేజ్ పంపి వేర్వేరు ఖాతాలకు డబ్బు జమ చేయించుకున్నారు. ఇలా మొత్తం రూ.92.5 లక్షలు బదిలీ అయ్యాక ఈ నెల 8న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఖాతాలను తనిఖీ చేసినప్పుడు వేర్వేరు ఖాతాలకు తన పేరుతో డబ్బు బదిలీ కావడాన్ని గుర్తించారు. దీనిపై మేనేజర్ ను ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. ఇది సైబర్ మోసమేనని వెంటనే గుర్తించి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తొలిసారి నగదు బదిలీ జరగి రెండు వారాలు గడిచిపోవడంతో పోలీసులు కేవలం రూ.7 లక్షల రూపాయలను మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. మరోవైపు బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
