ఆ ఎంపీ స్టయిలే వేరు.. ఏం తెచ్చారో చూస్తారట.. !
అందరూ ఒకే విధంగా ఉండాలని లేదు కదా! ఇప్పుడు.. అలానే ఉంది.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఓ పార్లమెంటు స్థానం పరిస్థితి.
By: Tupaki Desk | 22 April 2025 8:30 PMఒక్కొక్క నాయకుడి స్టయిల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరూ ఒకే విధంగా ఉండాలని లేదు కదా! ఇప్పుడు.. అలానే ఉంది.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఓ పార్లమెంటు స్థానం పరిస్థితి. గత ఏడాది ఎన్ని కల సమయంలో పొరుగు రాష్ట్రం నుంచి వాలిపోయి.. వెంటనే టికెట్ పొందేసి.. గెలుపు గుర్రం ఎక్కిన ఈయనకు రాజకీయాలు తక్కువ పరిచయమే అయినా.. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో .. అన్నీ సమగ్రంగా బోధ పడ్డాయి.
పైగా.. తాను చేసిన 30 ఏళ్ల వృత్తి జీవితంలోనూ రాజకీయాలతోనే ముడిపడి ఉన్నారు. దీంతో ఇప్పుడు కూడా.. ఆయన పాత పద్ధతులను అవలంబిస్తున్నారట. ఎవరైనా సరే.. ఆయనన కలవాలంటే.. సీఎం చంద్రబాబును మించిన ప్రొటోకాల్ అమలు చేస్తున్నారట. తనను కలిసేందుకు వచ్చేవారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పైగా.. కార్యాలయం అంతా సీసీ కెమెరాలతో నింపేశారు. ఎవరు వచ్చినా.. అందులో రికార్డు అవుతుంది. అలాగని.. ఎంతో నిక్కచ్చిగా ఉంటున్నారని అనుకుంటే పొరపాటేనని నియోజకవర్గంలో టాక్.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రభుత్వం రహదారులు వేయిస్తోంది. ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. కానీ.. కొందరు కాంట్రాక్టర్లు నేరుగా ప్రభుత్వ కార్యాలయాలకు ఫోన్లు చేసి.. తాము పనులు చేయలేమని చెప్పేస్తున్నారట. దీనికి కారణం.. సదరు ఎంపీ పెట్టుకున్న రెండు బృందాలు నిరంతరం పనులు పర్యవేక్షించి.. తమ వాటా రాలేదని.. నిలదీస్తున్నారట. పోనీ.. ఈ పనులు కేంద్రం ఇస్తున్న నిధులతో చేపడితే.. ఎంతో కొంత సమర్పించుకునే వారమని..కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
అంతేకాదు.. ప్రతి రూపాయికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం కూడా ఏర్పడింది. దీంతో తమకు మిగిలేది లేదని కాంట్రాక్టర్లు.. ఇద్దరు ఇటీవల డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చి మరీ మొర పెట్టుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఎంపీ టీడీపీ నాయకుడు కావడం.. పైగా ఆయనకు కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ పలుకుబడిఉండడంతో పాటు.. గతంలో ఉన్నతాధికారిగా కూడా చేసి ఉండడంతో ఈ విషయంలో ఎవరూ మాట్లాడలేక పోతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు పనులుఆపేశారని తెలిసింది.