Begin typing your search above and press return to search.

కొడుకు చికిత్స కోసం దాచుకున్న డబ్బు.. ఏడుస్తూ పోలీసుల వద్దకు.. ఏం జరిగిందంటే?

అపాయింట్‌మెంట్‌ నమోదు కోసం ఒక మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. వైద్యం అత్యవసరమని భావించిన ఆర్తీ ఆలస్యం చేయలేదు.

By:  Tupaki Political Desk   |   18 Feb 2026 10:49 AM IST
కొడుకు చికిత్స కోసం దాచుకున్న డబ్బు.. ఏడుస్తూ పోలీసుల వద్దకు.. ఏం జరిగిందంటే?
X

ఇంటర్నెట్‌ యుగంలో సమాచారం ఒక్క క్లిక్‌ దూరంలో ఉంది. కానీ అదే క్లిక్‌ క్షణాల్లో జీవితపు కష్టార్జిత పొదుపును మాయం చేసే ఉచ్చు కూడా కావొచ్చు. సైబర్‌ కేటుగాళ్లు ప్రతిరోజూ కొత్త పద్ధతులను వెతుకుతూ, ప్రజల అమాయకత్వాన్ని, అత్యవసర పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని శహడోల్‌ జిల్లాలో వెలుగుచూసిన తాజా ఘటన దీనికి మరో భయానక ఉదాహరణగా నిలిచింది.

యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే..

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన శివేష్‌కుమార్‌ సింగ్‌ కొడుకు ఎముకల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం నాగ్‌పుర్‌లోని ఓ ఆసుపత్రిలో చూపిస్తున్నారు. డాక్టర్ అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలనే ఆత్రంతో, వైద్యుడి ఫోన్‌ నంబర్‌ను గూగుల్‌లో వెదకమని శివేష్‌ తన భార్య ఆర్తీ సింగ్‌కు చెప్పాడు. ఇదే ఆ కుటుంబం చేసిన ‘పొరపాటు’. ఆమె సెర్చ్‌ చేయగా ఒక నంబర్‌ కనిపించింది. ఆర్తీ ఆ నంబర్‌కు ఫోన్‌ చేయగా, అవతలి వైపు వ్యక్తులు తాము ఆ వైద్య సిబ్బందినని నమ్మబలికారు. మాట్లాడే తీరు, వివరాలు చెప్పే విధానం అన్నీ ప్రొఫెషనల్ గా ఉన్నాయి. అమాయకులకు అనుమానం రాకుండా చాకచక్యంగా వ్యవహరించారు.

రూ. 2లక్షల చొప్పున.. మూడు విడతలుగా..

అపాయింట్‌మెంట్‌ నమోదు కోసం ఒక మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. వైద్యం అత్యవసరమని భావించిన ఆర్తీ ఆలస్యం చేయలేదు. యాప్‌ను తన ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన క్షణాల్లోనే ఆమె మొబైల్‌ నియంత్రణ సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి మూడు విడతలుగా మొత్తం రూ.1,59,000 మాయమయ్యాయి. ఇది వారి కొడుకు వైద్యం కోసం దాచుకున్న డబ్బు. కష్టపడి కూడబెట్టిన ఆ పొదుపు ఒక్కసారిగా ఖాళీ కావడంతో ఆ దంపతులు ఖంగుతిన్నారు. శహడోల్‌ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

బాధాకరమైన ఘటన..

ఈ ఘటనలో అత్యంత బాధాకరమైన అంశం.. నేరగాళ్లు కుటుంబం ఎదుర్కొంటున్న వైద్య అత్యవసర పరిస్థితిని అనుకూలంగా మలచుకోవడం. అనారోగ్యం, చికిత్స, అపాయింట్‌మెంట్‌ వంటి విషయాలు మనసును ఆందోళనకు గురిచేస్తాయి. అలాంటి సమయంలో ఆలోచించే శక్తి తగ్గుతుంది. ఇదే సైబర్‌ మోసగాళ్లకు అవకాశం. గూగుల్‌లో కనిపించిన నంబర్‌ నిజమైనదేనా..? అధికారిక వెబ్‌సైట్‌ నుంచే తీసుకున్నదా..? అన్న పరిశీలనకు కూడా సమయం లేకుండా ఉచ్చులో పడిపోయారు.

అవగాహన పెంచుకోవాలి..

ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు.. డిజిటల్‌ యుగంలో పెరుగుతున్న మోసాల ప్రతిబింబం. నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లు, ఫేక్‌ యాప్స్‌, రిమోట్‌ యాక్సెస్‌ లింకులు ఇవన్నీ కొత్త రూపాల్లో వస్తున్న పాత మోసాలే. ఒకసారి ఫోన్‌లో అనుమానాస్పద యాప్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే, బ్యాంకింగ్‌ యాప్స్‌, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం అన్నీ ప్రమాదంలో పడతాయి. కేవలం కొన్ని నిమిషాల్లో ఖాతా ఖాళీ కావచ్చు.

జాగ్రత్తలు పాటించాలి..

అందుకే ప్రతి పౌరుడు కొన్ని మౌలిక జాగ్రత్తలు పాటించాలి. వైద్యుడు, ఆసుపత్రి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ నుంచే తీసుకోవాలి. గూగుల్‌లో కనిపించే ప్రతి నంబర్‌ నమ్మదగినదని భావించకూడదు. అపాయింట్‌మెంట్‌ కోసం ఎప్పుడూ రిమోట్‌ యాక్సెస్‌ యాప్స్‌ లేదా అనుమానాస్పద యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయవద్దు. ఎవరైనా బ్యాంక్‌ వివరాలు, ఓటీపీలు, స్క్రీన్‌ షేర్‌ చేయమంటే వెంటనే కాల్‌ నిలిపేయాలి. అనుమానం కలిగితే 1930 సైబర్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలి.

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ తెలివిగా మారుతున్నారు. కానీ మనం కూడా అవగాహనతో ముందడుగు వేస్తేనే వారిని అడ్డుకోగలం. ఒక క్లిక్‌ తప్పు చేస్తే నష్టపోయేది కేవలం డబ్బు కాదు.. ఆశలు, కష్టాలు, భవిష్యత్తు కూడా. డిజిటల్‌ సౌకర్యాల యుగంలో అప్రమత్తతే అసలైన రక్షణ కవచం.