సీఎం కాన్వాయ్ వాహనాల్లో నీళ్లు కలిపిన డీజిల్... నడిరోడ్డుపై షాకింగ్ ఘటన!
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్.. రాట్లాంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గురువారం రాత్రి రోడ్డు మార్గంలో తన కాన్వాయ్ తో బయల్దేరారు.
By: Tupaki Desk | 27 Jun 2025 6:10 PM ISTరాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్ రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుంది. ఈ సమయంలో ఉన్నట్టుండి కాన్వాయ్ లోని 19 కార్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇలా అన్ని కార్లూ ఒకేసారి ఆగిపోవడంతో గందరగోళం తలెత్తింది. ఈ సమయంలో... అనుమానం వచ్చిన సిబ్బంది ఆ వాహనాల డీజిల్ ట్యాంక్ లను ఓపెన్ చేసి చూడగా.. అక్కడున్న విషయం చూసి ఒక్కసారిగా షాకయ్యారు.
అవును... రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్ లోని 19 కార్లు ఒకేసారి ఆగిపోయిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. అదంతా ఒకెత్తు అయితే.. అసలు ఆ కార్లు ఉన్నపలంగా ఒకేసారి ఆగిపోవడానికి గల కారణం షాకింగ్ గా మారింది. ఇందులో భాగంగా... ఆ వాహనాల డీజిల్ ట్యాంక్ లను తెరిచి చూడగా.. అందులో నీళ్లు ఉండటంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్.. రాట్లాంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గురువారం రాత్రి రోడ్డు మార్గంలో తన కాన్వాయ్ తో బయల్దేరారు. ఈ క్రమంలో దోసిగావ్ అనే ప్రాంతంలో ఉన్న శక్తి ఫ్యూయెల్ పెట్రోల్ పంప్ వద్ద కాన్వాయ్ లోని వాహనాలన్నింటికీ డీజిల్ కొట్టించారు. అంతవరకూ అంతా బాగానే ఉంది.
ఆ తర్వాత కొంతదూరం ప్రయాణించగానే సీఎం కాన్వాయ్ లోని మొత్తం 19 వాహనాలు ఒక్కొక్కటిగా ఆగిపోసాగాయి. ముందుకు కదలకుండా మొరాయించాయి. దీంతో.. ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో ఆ వాహనాలను తోసుకుంటూ రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. మరోవైపు విషయం తెలుసుకున్న స్థానిక యంత్రాంగం హుటాహుటిన అక్కడికి చేరుకుంది.
ఈ క్రమంలో... ఎందుకు ఇలా జరిగిందనే విషయం తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన అనంతరం.. డీజిల్ ట్యాంక్ తెరిచిచూస్తే అందులో నీళ్లు కన్పించాయట. ఈ సమయంలో.. అంతకముందే వాహనాల్లో నింపిన డీజిల్ ను బయటకు తీయగా.. అందులో సగానికి సగం నీరు కలిపినట్లు గుర్తించారంట.
దీంతో... అధికారులు వెంటనే ఆ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి తనిఖీ చేయగా.. అప్పటికే ఆ బంక్ లో డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా ఇదేవిధమైన ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారంట. దీంతో... రంగంలోకి దిగిన సంబంధిత అధికారులు తనిఖీ చేసి, కల్తీని నిర్ధారించి, ఆ బంక్ ను సీజ్ చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఇక నడిరోడ్డుపై నిలబడిపోయిన సీఎం కోసం ఇండోర్ నుంచి మరో కాన్వాయ్ వెహికల్స్ ని రప్పించి.. కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు కదిలారు! దీంతో.. ఏకంగా సీఎం వాహనాలకే నీళ్లు కలిపిన డీజిల్ పోసిన ఆ పెట్రోల్ బంక్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
