మూడో ఆడపిల్ల పుడితే రూ.50 వేలు.. చంద్రబాబు పుట్టిన రోజు నుంచి ప్రారంభం
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
By: Tupaki Desk | 21 April 2025 9:40 AMవిజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో జనాభా సమస్య తలెత్తకుండా ప్రజలు ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలని, మూడో బిడ్డను కనేందుకు యువ జంటలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపినిస్తున్న విషయం తెలిసిందే. తమ అధినేత పిలుపుతో స్పందించి మూడో బిడ్డకు జన్మనిచ్చే జంటలకు రూ.50 వేల ప్రోత్సాహం అందిస్తానని, ఇందు కోసం తన ఎంపీ వేతనం నుంచి డబ్బు వెచ్చిస్తానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రకటించారు. ఇప్పుడు అన్నమాట నిలబెట్టుకుంటూ నాలుగు జంటలకు ఆర్థిక సాయం చేశారు.
అధినేత మెప్పు కోసం నేతలు ఎవేవో చెబుతుంటారు. కానీ, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మాత్రం అన్న మాట ప్రకారం మూడో బిడ్డగా ఆడపిల్లకు జన్మనిచ్చిన జంటలకు రూ.50 వేల చొప్పున పంపిణీ చేశారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశంలో జనాభా తగ్గిపోతోంది. జనాభా పరంగా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నా, వచ్చే రెండు మూడు దశాబ్దాల్లో దేశ జనాభాలో యువత, వృద్ధుల జనాభా నిష్పత్తిలో భారీ వ్యత్యాసం ఏర్పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం జననాలు తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో వృద్ధుల జనాభా పెరిగిపోయే అవకాశం ఉందని, ఇది ఆర్థికాభివృద్ధికి పెను ముప్పుగా చంద్రబాబు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం జపాన్, జర్మనీ, చైనా వంటి దేశాల వృద్ధుల జనాభా పెరిగిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి నుంచే మేల్కొవాలని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం స్థానిక సంస్థల్లో పోటీకి అడ్డుగా ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేశారు. అంతేకాకుండా మూడో బిడ్డ ప్రసవానికి అనువుగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేశారు. ఒక్కరు చాలు ఇద్దరు వద్దు అనుకుంటున్న యువ జంటలు మూడో బిడ్డకు జన్మనిచ్చేలా ప్రోత్సహించాలని, ఈ విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు.
సీఎం చంద్రబాబు పిలుపుతో స్ఫూర్తి పొందిన ఎంపీ అప్పలనాయుడు తన నియోజకవర్గంలో మూడో బిడ్డ కన్నవారికి ప్రోత్సాహకాలు అందిస్తానని గతంలో ప్రకటించారు. ఆడపిల్లను కన్నవారికి రూ.50 వేల నగదు, మగ పిల్లాడు జన్మనిస్తే ఆవు దూడ అందిస్తానని చెప్పారు. ఇప్పుడు చెప్పినట్లే చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నాలుగు జంటలకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.