Begin typing your search above and press return to search.

రాజకీయాల్లో సినీ తారలు.. ఎంత మంది సక్సెస్‌ అయ్యారు!

మరో రెండు నెలల్లో జరగబోయే లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయబోమని.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్‌ అని విజయ్‌ ప్రకటించారు.

By:  Tupaki Desk   |   3 Feb 2024 4:34 AM GMT
రాజకీయాల్లో సినీ తారలు.. ఎంత మంది సక్సెస్‌ అయ్యారు!
X

సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్త విషయం ఏమీ కాదు. గతంలో ఎంతో మంది వివిధ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. కొందరు గెలిచారు.. మరికొందరు ఓడిపోయారు. అలాగే మరికొంతమంది సినీ నటులు సొంతంగా పార్టీలు పెట్టారు. అయితే వీరిలో కొందరు మాత్రమే విజయవంతమయ్యారు. మరికొందరు విఫలమయ్యారు.


తాజాగా తమిళ స్టార్‌ హీరోల్లో ఒకరైన ఇళయదళపతి విజయ్‌ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో ఆయన పార్టీని ఏర్పాటు చేశారు. అవినీతిరహిత పాలనే తమ ఎజెండా అని ప్రకటించారు. మరో రెండు నెలల్లో జరగబోయే లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయబోమని.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్‌ అని విజయ్‌ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో గతంలో పార్టీలు పెట్టిన సినిమా తారల అంశం చర్చకు వస్తోంది. అందులోనూ తమిళనాడు రాజకీయాలకు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. అధికారంలో ఉన్న డీఎంకే, ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకే రెండూ సినిమా రంగానికి చెందినవారివే.

అన్నాడీఎంకేను ప్రముఖ సినీ నటుడు ఎంజీ రామచంద్రన్‌ నెలకొల్పారు. అన్నాడీఎంకేను స్థాపించడంతోపాటు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా కూడా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన మరణానంతరం ఆయన సతీమణి జానకీ రామచంద్రన్‌ అతి స్వల్పకాలం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత తెలుగు, తమిళం సినిమాల్లో నటించిన ప్రముఖ సినీ నటి జయలలిత అన్నాడీఎంకే బాధ్యతలను చేపట్టి పలు పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే ఆమె మరణించారు.

డీఎంకే పార్టీ తరఫున చాలాకాలం ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి సినీ సంభాషణల రచయితగా, కథా రచయితగానే రాజకీయ ఆరంగేట్రం చేశారు. కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తు కూడా హీరోగా కొన్ని సినిమాలకు చేశాడు. ప్రస్తుతం కరుణానిధి మనుమడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు, స్టాలిన్‌ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్న ఉదయనిధి స్టాలిన్‌ సైతం పలు చిత్రాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

ఒకప్పటి తమిళ అగ్ర నటుడు శివాజీ గణేషన్‌ సైతం.. తమిజగ మున్నేట్ర మున్నాయ్‌ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. కేవలం ఏడాదికే ఆ పార్టీని ఎత్తేశారు.

ఇక ఇటీవల మరణించిన ప్రముఖ నటుడు, కెప్టెన్‌ విజయకాంత్‌ సైతం.. దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. మొదటిసారి 2006 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన పార్టీకి ఒకే ఒక్క సీటు లభించింది. అది కూడా విజయ్‌ కాంత్‌ ఒక్కరే గెలిచారు. ఆ తర్వాత 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసిన డీఎండీకే 40 స్థానాల్లో బరిలోకి దిగి ఏకంగా 29 స్థానాలను గెలుచుకుంది. మళ్లీ 2016, 2021 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో, ఎంఐఎం తదితర పార్టీలతో పోటీ చేసిన డీఎండీకే ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది.

తమిళనాడులోనే ప్రముఖ నటులు శరత్‌ కుమార్, కార్తీక్‌ కూడా పార్టీలు ఏర్పాటు చేశారు. అయితే వీరిద్దరూ నామమాత్రం ప్రభావాన్ని కూడా చూపలేకపోయారు. శరత్‌ కుమార్‌.. ఆల్‌ ఇండియా సమత్వువ మక్కల్‌ కచ్చి పేరుతో, కార్తీక్‌.. అహిల ఇండియా నాదులమ్‌ కచ్చి పేరుతో పార్టీలు పెట్టినా ప్రయోజనం దక్కలేదు.

ఇక మరో అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ సైతం ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. అయితే కమల్‌ కు కూడా నిరాశే ఎదురైంది. స్వయంగా ఆయనే ఓటమి పాలయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు.

ఇక సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అభిమానులను ఊరించి ఊరించి ఉసూరుమనిపించారు. రాజకీయాల్లోకి వస్తున్నా అని ప్రకటించి.. చివరకు యుద్ధరంగంలోకి దిగకముందే చేతులెత్తేశారు. రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు.

ఇక మన తెలుగు నాట విఖ్యాత నటుడు ఎన్టీఆర్‌ 1983లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీని ఏర్పాటు చేసిన 8 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. 1985 ఎన్నికలతోపాటు 1994 ఎన్నికల్లోనూ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా కేంద్రంలో 1984లో నేషనల్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ చక్రం తిప్పారు.

ఎన్టీఆర్‌ బాటలోనే మరో ప్రముఖ నటుడు చిరంజీవి సైతం 2008లో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 18 శాతం ఓట్లతో 70 లక్షలకు పైగా ఓట్లను సాధించారు. 18 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఒక చోట ఓడిపోయి ఒకచోట గెలిచారు. ఆ తర్వాత కొద్ది కాలానికే తన పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. 2014 ఎన్నికల నాటికి ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు.

తన అన్న బాటలోనే చిరంజీవి తమ్ముడు, ప్రముఖ సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ 2014లో జనసేన పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికలలో టీడీపీ– బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో, బహుజన సమాజ్‌ పార్టీతో కలిసి పోటీ చేశారు. అయితే ఒకే ఒక్క చోట మాత్రమే జనసేన పార్టీ గెలిచింది. రెండు చోట్ల బరిలోకి దిగిన పవన్‌ కళ్యాణ్‌ ఓడిపోయారు. మరో రెండు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో ఈసారి ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అలాగే అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునలతో నటించిన ప్రముఖ నటి విజయశాంతి సైతం తల్లి తెలంగాణ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ పార్టీని కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ లో విలీనం చేశారు. ఒకసారి టీఆర్‌ఎస్‌ తరఫున మెదక్‌ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ లో చేరారు. అక్కడ నుంచి బీజేపీలోకి మళ్లీ కాంగ్రెస్‌ లోకి వచ్చారు.

ఇప్పుడు తమిళ అగ్ర నటుడు విజయ్‌.. తమిళగ వెట్రి కళగమ్‌ పేరుతో పార్టీని ఏర్పాటు చేసి రాజకీయ అరంగ్రేటం చేస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయ్‌ సక్సెస్‌ అవుతాడా, లేదా అనేది వేచిచూడాల్సిందే.