Begin typing your search above and press return to search.

ఆ సినీ నిర్మాత ఫైనాన్స్ వెనుక డ్రగ్స్ దందా.. ఈడీ సంచలనం!

దాదాపు రూ.2వేల కోట్లు విలువైన 3500 కిలోల సూడో ఎఫిడ్రిన్ అనే రసాయనాన్ని అక్రమంగా రవాణా చేసిన ఆరోపణలతో అతడ్ని మార్చిలో అరెస్టు చేయటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 April 2024 5:26 AM GMT
ఆ సినీ నిర్మాత ఫైనాన్స్ వెనుక డ్రగ్స్ దందా.. ఈడీ సంచలనం!
X

సినీ నిర్మాత కం డీఎంకే మాజీ నాయకుడు జాఫర్ సాదిఖ్ కు సంబంధించిన మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణా తో భారీగా సంపాదించిన కోట్లాది రూపాయిల్ని సినిమాల్ని తీసిన విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. చిత్ర నిర్మాణంతో పాటు హోటళ్లు.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు డబ్బుల్ని మళ్లించినట్లుగా గుర్తించారు.

సాధిఖ్ అంశం మీద ఫోకస్ చేసిన ఈడీ.. అతడి లీలల్ని గుర్తించారు. చెన్నైలో ఒక హోటల్ ను నిర్మించటంతో పాటు.. రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లుగా పలు ఆధారాల్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు కోలీవుడ్.. బాలీవుడ్ చిత్ర ఫైనాన్షియర్లతోనూ సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ రెండు ఇండస్ట్రీలకు సంబంధించిన ఫైనాన్షియర్స్ తో ఎవరితో సన్నిహితంగా ఉంటారన్న అంశంతో పాటు.. రాజకీయ నాయకులకు నిధులు సమకూర్చిన అంశాన్ని శోధిస్తున్నట్లుగా ఎన్ సీబీ గుర్తించింది.

దాదాపు రూ.2వేల కోట్లు విలువైన 3500 కిలోల సూడో ఎఫిడ్రిన్ అనే రసాయనాన్ని అక్రమంగా రవాణా చేసిన ఆరోపణలతో అతడ్ని మార్చిలో అరెస్టు చేయటం తెలిసిందే. ఇదే కాదు కొబ్బరిపొడి.. బలవర్థక పౌడర్ల పేరుతో సూడో ఎఫిడ్రిన్ ను కలిసి ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ కు రవాణా చేసినట్లుగా చెబుతున్నారు. అతను సప్లై చేసే మత్తు పదార్థానికి కేజీకి రూ.లక్ష చొప్పున కమీషన్ తీసుకున్నట్లుగా నార్కొటిక్స్ బ్యూరో వెల్లడించింది.

చెన్నై.. మధురై.. తిరుచిరాపల్లిలో ఉన్న సాధిఖ్ ఆస్తులు.. అతడి సంబంధీకులపైనా దాడులు నిర్వహించిన క్రమంలో అతడి గుట్టు రట్టైంది. సాదిఖ్ వ్యవహారం బయటకు రావటం తమిళనాడు అధికార డీఎంకేకు తలపోటుగా మారటంతో అతడ్ని పార్టీ నుంచి వెంటనే బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో అతడికి డీఎంకే మంత్రులతోనూ సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సాధిఖ్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవంటూ తమిళనాడు రాష్ట్ర లా మినిస్టర్ ఎస్. రఘుపతి సైతం స్పష్టం చేయటం గమనార్హం.