Begin typing your search above and press return to search.

ఆర్మీ, పారా, ప్ర‌భుత్వ ఉద్యోగులు..దేశ‌ ద్రోహి మోతీరాం జాబితాలో ఎంద‌రో

ఇప్పుడు ఇలాంటి వ్య‌క్తి నెట్ వ‌ర్క్ ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. దానిని చూసి అధికారులే నివ్వెర‌పోయే ప‌రిస్థితి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   26 Aug 2025 6:00 PM IST
ఆర్మీ, పారా, ప్ర‌భుత్వ ఉద్యోగులు..దేశ‌ ద్రోహి మోతీరాం జాబితాలో ఎంద‌రో
X

ఒక దేశానికి చెంది శ‌త్రు దేశానికి స‌మాచారం చేరవేసేవాళ్ల‌ని దేశ ద్రోహులు అంటారు... ఒక‌టీ అరా కాదు ఏకంగా పెద్ద నెట్ వ‌ర్క్ ఏర్పాటు చేసుకున్న వారిని ఇంత‌కంటే ఏదైనా పెద్ద ప‌దంతో పిల‌వాలేమో..? అది కూడా చిన్న‌చిన్న మొత్తాల‌కే ప్ర‌లోభ ప‌డి ర‌హ‌స్యాల‌ను చేర‌వేస్తే.. అలాంటివారిని ఇంక ఏం చేసినా త‌ప్పు లేద‌నిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి వ్య‌క్తి నెట్ వ‌ర్క్ ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. దానిని చూసి అధికారులే నివ్వెర‌పోయే ప‌రిస్థితి వ‌చ్చింది.

స‌రిగ్గా మూడు నెల‌ల కింద‌ట‌...

అత‌డి పేరు మోతీరామ్ జాట్. ప‌నిచేసేది అత్యంత క‌ఠిన శిక్ష‌ణ‌, ప‌ర్య‌వేక్ష‌ణ ఉండే సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌)లో. హోదా స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్. అన్నివిధాలా స‌మాజంలో ఉన్న‌తంగా ఉండాల్సి వాడు. అలాంటి వ్య‌క్తే దారిత‌ప్పాడు. చివ‌ర‌కు ఎంత‌కు తెగించాడంటే... శ‌త్రుదేశం పాకిస్థాన్ కు సున్నిత‌మైన స‌మాచారం చేర‌వేస్తూ దొరికిపోయాడు. ఇది బ‌య‌ట‌ప‌డింది మే 27న‌. అదే రోజు మోతీరామ్ ను జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది.

దేశ‌ద్రోహుల నెట్ వ‌ర్క్ పెద్ద‌దే..

మోతీరామ్ జాట్ ఫోన్ లో 15 మంది నంబ‌ర్ల‌ను ద‌ర్యాప్తు సంస్థ గుర్తించారు. వీరిలో న‌లుగురు ఆర్మీ, న‌లుగురు పారామిల‌ట‌రీ సిబ్బంది, మిగిలిన వారు ప్ర‌భుత్వ ఉద్యోగులు కావ‌డం గ‌మ‌నార్హం. వీరంతా మోతీరామ్ తో ట‌చ్ లో ఉన్న‌ట్లు ఇంగ్లిష్ మీడియా పేర్కొంటోంది. ఇప్పుడు మోతీరామ్ ను ఫోన్ ఎన్ఐఏ విశ్లేషిస్తుంటే, మ‌రిన్ని విస్తుపోయే అంశాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అత‌డు ఇంట‌ర్నెట్ కాల్స్ కూడా చేశాడ‌ని గుర్తించారు. పాక్ కు చెందిన ఆప‌రేట‌ర్ స‌లీంతో ట‌చ్ లో ఉన్నాడ‌ని తేల్చారు. ఇత‌డు మోతీరామ్ నుంచి సున్నిత‌మైన స‌మాచారాన్ని తెప్పించుకున్నాడు. అది కూడా అత్య‌ధికంగా రూ.12 వేల‌కే కావ‌డం గ‌మ‌నార్హం. అంటే, ఇంత‌కంటే త‌క్కువ మొత్తానికే మోతీరామ్ స‌మాచారం ఇంకెంత అందించాడో...?

అనేక రాష్ట్రాల్లో లింకులు... కోల్ క‌తా వ్య‌క్తి కీల‌కం

మోతీరామ్ కు మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, హ‌రియాణా, యూపీ, రాజ‌స్థాన్, ఛ‌త్తీస్ గ‌ఢ్‌, అసోం, బెంగాల్ నుంచి డ‌బ్బులు జ‌మ అయ్యాయి. ఇక మోతీరామ్ తో మాట్లాడేందుకు వాడే ఫోన్ లోని సిమ్ కార్డును కోల్ క‌తా నుంచి ఓ వ్య‌క్తి తీసుకెళ్లాడు. అత‌డు యాక్టివేష‌న్ కోడ్ ను లాహోర్ లోని ఆప‌రేట‌ర్ తో పంచుకున్నాడు. కోల్ క‌తా వ్య‌క్తి పాక్ మ‌హిళ‌ను పెళ్లాడాడు. పాకిస్థాన్ వెళ్లి స్థిర‌ప‌డ్డాడు. ఏటా రెండుసార్లు కోల్ క‌తా వ‌స్తుంటాడ‌ని గుర్తించారు. మొత్తానికి మోతీరామ్ దేశ‌ద్రోహుల నెట్ వ‌ర్క్ చాలా పెద్ద‌దే అని తెలుస్తోంది.

కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 22న‌ క‌శ్మీర్ లోని పెహ‌ల్గాంలో ప‌ర్య‌ట‌కుల‌పై పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు దాడి చేసి 22 మందిని హ‌త‌మార్చారు. ఆ త‌ర్వాత భార‌త్ మే నెల‌లో ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్టింది. అనంత‌ర ప‌రిణామాల్లోనే మోతీరామ్ ఉదంతం బ‌య‌ట‌ప‌డింది.