పెళ్లికి పది రోజుల ముందు ఊహించని ట్విస్ట్.. పెళ్లి కొడుకుతో అత్త పరార్!
పెళ్లి అనేది రెండు మనసుల కలయికే కాదు... రెండు కుటుంబాల బంధం కూడా. కానీ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన పెళ్లి బంధానికే షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.
By: Tupaki Desk | 10 April 2025 4:25 PM ISTఓ మై గాడ్! ఇది కదా అసలైన ట్విస్ట్ అంటే.. పెళ్లికి ఇంకా పది రోజులే ఉందనగా... లవ్ స్టోరీ రివర్స్ గేర్‌లో నడిచింది. పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురు కాదు... ఏకంగా అత్తగారే జంప్! మూడున్నర లక్షల క్యాష్... ఐదు లక్షల గోల్డ్ కూడా ఎత్తుకెళ్లారు. మనోళ్ల లవ్ స్టోరీ గురించి వివరంగా తెలుసుకుందాం.
పెళ్లి అనేది రెండు మనసుల కలయికే కాదు... రెండు కుటుంబాల బంధం కూడా. కానీ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన పెళ్లి బంధానికే షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. పెళ్లికి కేవలం పది రోజుల సమయం ఉండగా... స్వయంగా పెళ్లి కూతురి తల్లి, కాబోయే అల్లుడితో కలిసి పారిపోయింది. అంతేకాదు... ఇంటిలోని రూ. 3.5 లక్షల నగదు, రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కూడా తీసుకువెళ్లడం సంచలనంగా మారింది.
ఏప్రిల్ 16న జరగాల్సిన కుమార్తె వివాహానికి సర్వం సిద్ధం చేసింది అనిత. ఆహ్వాన పత్రికలు పంచేశారు... పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. ఇంతలో ఊహించని విధంగా ఏప్రిల్ 6న అనిత, కాబోయే అల్లుడు రాహుల్‌తో కలిసి అదృశ్యం కావడంతో ఇరు కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
ఈ ఘటనపై పెళ్లి కూతురు శివానీ తండ్రి జితేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెతో మాట్లాడాల్సిన రాహుల్... తన భార్యతో గంటల తరబడి ఫోన్‌లో ముచ్చటించేవాడని ఆయన తెలిపారు. రోజులో దాదాపు 22 గంటలు వారు మాట్లాడుకునేవారని గమనించినా... పెళ్లి దగ్గరపడుతుండటంతో తాను ఏమీ అనలేకపోయానని వాపోయారు. ప్రస్తుతం రాహుల్, అనిత ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయని ఆయన చెప్పారు.
పెళ్లి కూతురు శివానీ కూడా ఈ విషయంపై స్పందించింది. గత మూడు నాలుగు నెలలుగా రాహుల్, తన తల్లి మధ్య అధికంగా ఫోన్ సంభాషణలు జరుగుతున్నాయని ఆమె తెలిపింది. వారు రూ. 3.5 లక్షల నగదు, రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పారిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లి తీసుకువెళ్లిన డబ్బు, నగలు తిరిగి ఇవ్వాలని శివానీ కోరుతోంది. ఈ విచిత్రమైన ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లికి సిద్ధమవుతున్న ఇంట్లో ఇలాంటి సంఘటన జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
