Begin typing your search above and press return to search.

'అమూల్' పోయి.. 'మ‌ద‌ర్' వ‌చ్చే.. ఏపీలో పెట్టుబ‌డులు!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన మ‌ద‌ర్ డెయిరీ.. త్వ‌ర‌లోనే ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు రెడీ అయింది.

By:  Tupaki Desk   |   31 March 2025 11:17 AM IST
అమూల్ పోయి.. మ‌ద‌ర్ వ‌చ్చే.. ఏపీలో పెట్టుబ‌డులు!
X

ఏపీలో పాల విక్ర‌యాల‌కు సంబంధించి వైసీపీ హ‌యాంలో అమూల్ సంస్థ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే... ఈ సంస్థ‌కు ప్ర‌భుత్వం దోచిపెడుతోంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. గుజ‌రాత్‌కు చెందిన ఆనంద్ మిల్క్ యూనియ‌న్ లిమిటెడ్‌(అమూల్‌)తో వైసీపీ స‌ర్కారు ప‌లు ఒప్పందాలు చేసుకుంది. స్థానికంగా పాల ఉత్ప‌త్తిదారులు ఆందోళ‌న చేసినా.. త‌మ వ్యాపారాలు దెబ్బ‌తింటున్నాయ‌ని చెప్పినా.. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా అమూల్‌ను జ‌గ‌న్ స‌ర్కారు భారీగా ప్రోత్స‌హించింది. అయితే.. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వంలో అమూల్ పోగా.. కొత్త‌గా మ‌ద‌ర్ డెయిరీ ప్ర‌వేశించింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన మ‌ద‌ర్ డెయిరీ.. త్వ‌ర‌లోనే ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు రెడీ అయింది. అయితే.. దీనివ‌ల్ల స్థానికంగా వ్యాపారాలు త‌గ్గుతాయా? పెరుగుతాయా? ప్ర‌జ‌ల‌కు లాభ‌మెంత‌? అనే విష‌యాల‌పై కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. మ‌రోవైపు.. త‌మ సంస్థ‌ల‌ను గుజ‌రాత్‌, ఏపీల‌లో ఈ ఏడాది విస్త‌రించ‌నున్న‌ట్టు.. మదర్‌ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీష్‌ బాండ్లిష్ తెలిపారు. 'మ‌ద‌ర్ డెయిరీ' కేవ‌లం పాల‌కే ప‌రిమితం కాలేద‌ని.. పండ్ల వ్యాపారంలోనూ ముందుంద‌ని వివ‌రించారు. చిత్తూరు జిల్లాలోని సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో పండ్ల ఉత్ప‌త్తుల నిల్వ‌కు సంబంధించి 200 కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్టు చెప్పారు.

అదేవిధంగా పండ్లు, పాల ప్రాసెసింగ్ యూనిట్ల‌ను కూడా ఏపీలో పెడ‌తామ‌ని.. దీనికిగాను రూ.300 కోట్ల‌తో ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నామ‌ని బాండ్లిష్ వివ‌రించారు. అదేవిధంగా గుజ‌రాత్‌లోనూ పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్టు చెప్పారు. వ‌చ్చే రెండేళ్ల‌లో రెండు రాష్ట్రాల్లోనూ త‌మ వ్యాపారాలు విస్త‌రించ‌నున్న‌ట్టు మ‌ద‌ర్ డెయిరీ ఎండీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మదర్‌ డైరీ సఫల్‌ బ్రాండ్‌కు మూడు చోట్ల పండ్లు, కూరగాయల ప్రాసింగ్‌ ప్లాంట్లు ఉన్నాయన్నారు. అదేవిధంగా పాలు, పాల ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసేందుకు రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో మ‌హారాష్ట్ర‌లో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. అయితే.. మ‌ద‌ర్ డెయిరీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం ఆచి తూచి అడుగులు వేస్తోంది.