Begin typing your search above and press return to search.

ప్రియుడి మాట విని ముగ్గురు పిల్లలను హతమార్చిన తల్లి!

అమీన్‌పూర్ మండలం బీరంగూడలో ఇటీవల ముగ్గురు చిన్నారులు హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

By:  Tupaki Desk   |   3 April 2025 1:34 PM IST
Mother and Lover Arrested for Murdering Three Children in Beeramguda
X

అమీన్‌పూర్ మండలం బీరంగూడలో ఇటీవల ముగ్గురు చిన్నారులు హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును ఛేదించిన పోలీసులు, పిల్లల తల్లి రజిత, ఆమె ప్రియుడు శివను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతోనే రజిత తన ముగ్గురు పిల్లలను అత్యంత కిరాతకంగా ఊపిరాడకుండా చేసి హత్య చేసిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, రజిత ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆరు నెలల క్రితం పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆమెకు తన క్లాస్‌మేట్ అయిన శివతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం అనతికాలంలోనే వివాహేతర సంబంధానికి దారితీసింది. రజిత, శివ నిత్యం చాటింగ్, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకునేవారు. అంతేకాకుండా, వారు పలుమార్లు రహస్యంగా కలుసుకున్నారు.

రజిత భర్త చెన్నయ్య ఆమె కంటే 20 సంవత్సరాలు పెద్దవాడు కావడంతో ఆమెకు అతనిపై అంతగా ఇష్టం ఉండేది కాదు. ఈ కారణంగా వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. శివకు ఇంకా వివాహం కాకపోవడంతో అతడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని రజిత భావించింది. ఈ విషయాన్ని శివతో చెప్పగా, పిల్లలు లేకుండా ఒంటరిగా వస్తేనే పెళ్లి చేసుకుంటానని శివ స్పష్టం చేశాడు.

శివను వివాహం చేసుకోవాలంటే తన ముగ్గురు పిల్లలు - సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8)లను అడ్డు తొలగించుకోవాలని రజిత నిర్ణయించుకుంది. మార్చి 28న సాయంత్రం 6 గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పగా, ఆ పనిని త్వరగా పూర్తి చేయమని అతడు చెప్పాడు. అదే రోజు రాత్రి భర్త చెన్నయ్య భోజనం చేసి రాత్రి 10 గంటలకు ట్యాంకర్‌తో చందానగర్‌కు వెళ్లగా, ఇదే సరైన సమయమని భావించిన రజిత ఒక్కొక్కరిగా తన ముగ్గురు పిల్లల ముక్కు, నోటిపై టవల్‌ను వేసి గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపింది.

పిల్లలను అడ్డు తొలగించుకోవాలని శివ రజితను ప్రోత్సహించాడని, ఆమె అత్యంత కిరాతకంగా వారిని చంపివేసిందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి, అమీన్‌పూర్ ఇన్‌స్పెక్టర్ నరేష్, డీఐ రాజు, ఎస్‌ఐ సోమేశ్వరి, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.