సముద్రంలో మునిగిన 3,000 కార్లు... ఏం జరిగిందంటే..!
అవును... 'మార్నింగ్ మిడాస్' అనే నౌక, అలాస్కాలోని అలూటియన్ దీవులకు దూరంగా ఉన్న అంతర్జాతీయ జలాల్లో మునిగిపోయింది.
By: Tupaki Desk | 25 Jun 2025 3:00 PM ISTనిత్యం ప్రపంచంలో ఏదో ఒకమూల యుద్ధాలు, సంఘర్షణలు, ఘోర విపత్తులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మెక్సికోకు సుమారు 3,000 వాహనాలను రవాణా చేస్తున్న కార్గో షిప్ ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది, ముందుగా భారీగా మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బంది ఓడను వదిలేసి సురక్షితంగా బయటపడ్డారు.
అవును... 'మార్నింగ్ మిడాస్' అనే నౌక, అలాస్కాలోని అలూటియన్ దీవులకు దూరంగా ఉన్న అంతర్జాతీయ జలాల్లో మునిగిపోయింది. ఈ విషయాన్ని లండన్ కు చెందిన జోడియాక్ మారిటైమ్ అనే నౌక నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంలో మెక్సికోకు తీసుకెళ్తున్న 3,000 కార్లు నడి సముద్రంలో మునిగిపోయాయని వెల్లడించింది.
జూన్ 3న మార్నింగ్ మిడాస్ అనే నౌక అడాక్ ద్వీపానికి నైరుతి దిశలో 300 మైళ్ల దూరంలో ఉన్నప్పుడు మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఈ క్రమంలో రోజుల తరబడి మంటలు అదుపు చేయలేకపోయారని అంటున్నారు. ఈ క్రమంలో... చివరికి 600 అడుగుల ఓడను సముద్రంలో నిలిపివేసినట్లు సియాటిల్ టైమ్స్ నివేదించింది.
ప్రమాదం జరిగిన సమయంలో ఓడలో 22 మంది సిబ్బంది ఉండగా.. వారందరినీ సురక్షితంగా లైఫ్ బోట్ లోకి తరలించారని.. అనంతరం సమీపంలోని మర్చంట్ మెరైన్ షిప్ వారిని రక్షించిందని.. ఈ ప్రమాదంలోకాని, తరలింపు సమయంలో కానీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ప్రమాదంలో నష్టాన్ని అరికట్టడానికి చేసిన ప్రయత్నాలేవీ సక్సెస్ కాలేదని అంటున్నారు.
అందుకు ప్రధాన కారణం... వాతావరణం క్షీణించడంతో పాటు సుమారు 16,400 అడుగుల లోతు, భూమి నుండి 415 మైళ్ల దూరంలో ఉండటమే అని, అవే నీటిలో ఓడ మునిగిపోవడానికి దోహదపడిందని చెబుతున్నారు. ఈ నౌక మే 26న చైనాలోని యాంటై నుండి బయలుదేరి మెక్సికోలోని ఒక ప్రధాన పసిఫిక్ ఓడరేవుకు వెళుతోందని నివేదికలు పేర్కొన్నాయి!
ఇక... ఈ ఓడలో సుమారు 70 ఎలక్ట్రిక్, 680 హైబ్రిడ్ మోడల్ లతో సహా సుమారు 3,000 కొత్త వాహనాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకెళ్లే ఓడల్లో ఫైర్ సేఫ్టీ గురించి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ సంఘటన జరగడం గమనార్హం.
