Begin typing your search above and press return to search.

ఇస్రోపై రోజూ 100కి పైగా సైబర్‌ దాడులు!

ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి చంద్రయాన్‌ –3ని ప్రయోగించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Oct 2023 9:23 AM GMT
ఇస్రోపై రోజూ 100కి పైగా సైబర్‌ దాడులు!
X

ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి చంద్రయాన్‌ –3ని ప్రయోగించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ దించిన తొలి దేశంగా భారత్‌ రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇస్రో మానవ సహిత గగన్‌ యాన్‌ యాత్రలకు శ్రీకారం చుడుతోంది.

మరోవైపు ఇస్రోను టార్గెట్‌ గా చేసుకుని సైబర్‌ దాడులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా శత్రు దేశాలు చైనా, పాకిస్థాన్‌ లతోపాటు అంతర్జాతీయ సైబర్‌ నేరగాళ్లు ఈ పనులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్‌ సోమనాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్రోపై రోజుకి 100కి పైగా సైబర్‌ దాడులు జరుగుతున్నాయని బాంబుపేల్చారు.

కేరళలోని కొచ్చి నగరంలో రెండు రోజుల అంతర్జాతీయ సైబర్‌ సదస్సు జరిగింది. ఈ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఇస్రో అధినేత సోమనాథ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. భారత్‌ పై రోజూ 100కి పైగా సైబర్‌ దాడులు జరుగుతున్నాయన్నారు. అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించే రాకెట్‌ టెక్నాలజీలో సైబర్‌ దాడులకు అవకాశం చాలా ఎక్కువ ఉందన్నారు. అయితే ఇటువంటి సైబర్‌ దాడుల్ని ఎదుర్కొనేందుకు తమకు సన్నద్ధత ఉందని తెలిపారు. బలమైన సైబర్‌ సెక్యూరిటీని కలిగి ఉన్నామని వెల్లడించారు.

సైబర్‌ దాడుల నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ తో పాటు రాకెట్‌ లోని హార్డ్‌వేర్‌ చిప్‌ ల భద్రతపై తాము దృష్టి సారించామని సోమనాథ్‌ తెలిపారు. వివిధ పరీక్షల్లో ఇస్రో ముందుకు వెళుతోందని వెల్లడించారు. ఇంతకుముందు ఒకే ఉపగ్రహాన్ని పర్యవేక్షించగలిగేవారమని.. కానీ ఇప్పుడు ఒకేసారి అనేక ఉపగ్రహాలను పర్యవేక్షించే సాఫ్ట్‌వేర్‌ మన సొంతమని సోమనాథ్‌ చెప్పారు.

అలాగే నావిగేషన్, మెయింటెనెన్స్‌ కోసం వివిధ రకాల శాటిలైట్స్‌ ఉన్నాయని తెలిపారు. ఇవి కాకుండా సాధారణ ప్రజల రోజూవారీ జీవితానికి సహాయపడే ఉపగ్రహాలు మనకు ఉన్నాయని చెప్పారు. వివిధ రకాల సాఫ్ట్‌వేర్లతో ఇవి నియంత్రించబడుతున్నాయని వెల్లడించారు. వీటిన్నింటిని రక్షించడానికి మనకు సైబర్‌ సెక్యూరిటీ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అధునాతన టెక్నాలజీ ఓ వరమని, అదే సమయంలో దీనివల్ల ముప్పు కూడా ఉందని ఆయన హెచ్చరించారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వంటి టెక్నాలజీని ఉపయోగించి సైబర్‌ నేరగాళ్ల నుంచి ఎదురవుతున్న సవాళ్లను మనం అదే టెక్నాలజీతో ఎదుర్కోగలమని సోమనాథ్‌ చెప్పారు. ఈ దిశగా పరిశోధనలు, కృషి జరగాలని సూచించారు. సైబర్‌ రంగానికి తగిన భద్రత కల్పించే సామర్థ్యం కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. రాష్ట్రంలో డిజిటల్‌ యూనివర్సిటీ నెలకొల్పడం ద్వారా ప్రభుత్వం ఈ రంగానికి అవసరమైన తోడ్పాటు కూడా అందిస్తోందని కేరళ రాష్ట్ర మంతి తెలిపారు.