ఒకే ఇంట్లో 500 మంది.. 22మంది పాకిస్తాన్ మహిళలు.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!
ఈ నేపథ్యంలో మొరాదాబాద్‌లో దీర్ఘకాలిక వీసాలపై నివసిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
By: Tupaki Desk | 6 May 2025 3:45 PM ISTఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ వింత ఘటన అందరినీ ఆశ్చార్యానికి గురిచేస్తోంది. ఇక్కడ 22 మంది పాకిస్తానీ మహిళలు దీర్ఘకాలిక వీసాల మీద నివసిస్తున్నారు. వీరికి ఏకంగా 95 మంది సంతానం ఉండడం సంచలనం రేపుతోంది. ఈ మహిళల కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు 500 వరకు ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ మహిళలందరికీ ఇప్పటికీ పాకిస్తాన్ పౌరసత్వం ఉండగా, వారి పిల్లలు ఇండియాలో జన్మించడం వల్ల ఇక్కడి పౌరసత్వం పొందారు. అధికారులు ఈ మహిళల వద్ద దీర్ఘకాలిక వీసాలు, పాకిస్తాన్ పౌరసత్వం ధృవీకరించే పత్రాలు ఉన్నాయని గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, మనదేశంలో నివసిస్తున్న పాకిస్తానీయులందరినీ వారి స్వదేశానికి తిరిగి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనితో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. సరైన పత్రాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్న వారి కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొరాదాబాద్‌లో దీర్ఘకాలిక వీసాలపై నివసిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సమయంలోనే ఈ 22 మంది పాకిస్తానీ మహిళల విషయం వెలుగులోకి వచ్చింది. వీరే కాకుండా, ఇద్దరు పాకిస్తానీ పురుషులు కూడా మొరాదాబాద్ జిల్లాలో చాన్నాళ్లుగా నివసిస్తున్నట్లు తేలింది. ఈ మహిళల్లో చాలా మంది భారతీయులను పెళ్లి చేసుకుని ఇక్కడ స్థిరపడ్డారు.
పోలీసుల దర్యాప్తులో ఈ 22 మంది మహిళలకు మొత్తం 95 మంది పిల్లలు ఉన్నారని తేలింది. వీరిలో చాలా మందికి వివాహాలు కూడా జరిగాయి. ఈ 22 మంది మహిళల్లో నానమ్మలు, అమ్మమ్మలు కూడా ఉన్నారు. వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఈ కుటుంబాల్లో ఇప్పుడు 500 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఈ మహిళలకు ఇప్పటికీ పాకిస్తాన్ పౌరసత్వం ఉండడం గమనార్హం. అయితే, వారి పిల్లలు పుట్టుకతోనే భారతీయ పౌరులు కావడం విశేషం. ఈ 22 మంది మహిళలు రేషన్, ఆధార్ కార్డులు కలిగి ఉన్నారు. దీని ద్వారా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక సంక్షేమ పథకాలను పొందుతున్నారు. వీరందరూ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
ఈ మహిళల్లో ఇద్దరు నాలుగేళ్ల క్రితమే భారతదేశానికి వచ్చారని, మరికొందరు దశాబ్దాలుగా జిల్లాలో నివసిస్తున్నారని మొరాదాబాద్ సిటీ ఎస్పీ కుమార్ రణ్ విజయ్ సింగ్ చెప్పారు. సరైన పత్రాలు ఉండటం వల్ల వారిని దేశం నుండి బహిష్కరించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
