మెల్లమెల్లగా మాయం కానున్న చందమామ.. అసలు కారణం ఇదే..
తాజాగా గుర్తించిన ఈ చిన్నపాటి పగుళ్లను శాస్త్రవేత్తలు 'స్మాల్ మేర్ రిడ్జెస్' (Small Mare Ridges) అని పిలుస్తున్నారు.
By: Tupaki Political Desk | 22 Feb 2026 3:00 PM ISTఖగోళ శాస్త్రంలో చందమామకు ఉన్న ప్రాధాన్యత సాధారణమైనది కాదు.. భూమికి అత్యంత సమీపంలో ఉంటూ, మానవ ఊహలకు, పరిశోధనలకు కేంద్ర బింధువుగా నిలిచే జాబిల్లి గురించి ఇప్పుడు ఒక నిజం వెలుగులోకి వచ్చింది. మనకు వెన్నెలను పంచే చందమామ పరిమాణం క్రమంగా తగ్గిపోతోంది. అంటే చంద్రుడు క్రమంగా కుచించుకుపోతున్నాడని (Shrinking) శాస్త్రవేత్తలు గుర్తించారు. నేషనల్ ఎయిర్ & స్పేస్ మ్యూజియంకు చెందిన సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ ప్లానెటరీ స్టడీస్ పరిశోధకులు వెల్లడించిన ఈ విషయం ఇప్పుడు అంతరిక్ష పరిశోధక ప్రపంచంలో పెను సంచలనంగా మారింది.
చంద్రకంపాల ప్రభావం..
చంద్రుడు ఎందుకు కుచించుకుపోతున్నాడనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ‘చంద్రకంపాలను’ (Moon quakes) ప్రధాన కారణంగా చూపుతున్నారు. భూమిపై భూకంపాలు సంభవించినట్లే, చంద్రుని అంతర్భాగంలో జరిగే మార్పుల వల్ల చంద్రకంపాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రకంపనల ధాటికి చంద్రుని ఉపరితలంపై తీవ్రమైన ఒత్తిడి పెరిగి, పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఈ పగుళ్ల వల్లే చంద్రుని పరిమాణంలో మార్పులు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం బాహ్యంగా కనిపించే మార్పు మాత్రమే కాదు.., చంద్రుని భౌగోళిక ఉనికినే ప్రభావితం చేసే పరిణామం.
లూనార్ మారియా.. వెలుగులోకి వస్తున్న కొత్త పగుళ్లు
చందమామపై పగుళ్లు ఉన్నాయనే విషయం శాస్త్రవేత్తలకు 2010 నుంచే తెలుసు. అయితే, తాజాగా చేపట్టిన పరిశోధనల్లో దిగ్భ్రాంతికరమైన కొత్త విషయాలు బయటపడ్డాయి. చంద్రునిపై ఉన్న 'లూనార్ మారియా' (Lunar Maria) ప్రాంతాల్లో తాజాగా 1,114 కొత్త పగుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. పదేళ్ల క్రితం తెలిసిన పగుళ్ల కంటే ఇవి చాలా విస్తృతమైనవి, లోతైనవి కావడం గమనార్హం. జాబిల్లిపై ఇన్ని వేల పగుళ్లు ఏర్పడడం అంటే, ఆ ఖగోళ వస్తువు లోపల ఏదో పెద్ద మార్పు జరుగుతోందనడానికి బలమైన సంకేతం.
స్మాల్ మేర్ రిడ్జెస్.. శాస్త్రీయ విశ్లేషణ
తాజాగా గుర్తించిన ఈ చిన్నపాటి పగుళ్లను శాస్త్రవేత్తలు 'స్మాల్ మేర్ రిడ్జెస్' (Small Mare Ridges) అని పిలుస్తున్నారు. చంద్రుడు చల్లబడుతున్న కొద్దీ, అతని పైపొర ముడతలు పడుతూ, ఒకదానిపై ఒకటి విరిగి పడుతుండడం వల్ల ఈ రిడ్జెస్ ఏర్పడుతున్నాయి. దీన్ని ఒక పండు ఎండిపోయి ముడతలు పడడంతో పోల్చవచ్చు. ఈ స్మాల్ మేర్ రిడ్జెస్ చంద్రుని ఉపరితలాన్ని అస్థిరపరుస్తున్నాయి. భవిష్యత్తులో చంద్రునిపైకి పంపబోయే మానవ సహిత మిషన్లకు, అక్కడ నిర్మించబోయే బేస్ క్యాంపులకు ఈ పగుళ్లు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.
భవిష్యత్తు పరిశోధనలకు హెచ్చరిక
చంద్రుడు కుచించుకుపోవడం అనేది కేవలం గణాంకాలకే పరిమితమైన అంశం అనుకుంటే పొరబాటే. ఇది చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తిని, అక్కడ ఉండే ధూళి కణాల కదలికలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేస్తున్న మన ఇస్రో (ISRO) వంటి సంస్థలకు ఈ సమాచారం కీలకం. చంద్రకంపాలు సంభవించే ప్రాంతాల్లో ల్యాండర్లను దించడం ప్రమాదకరమని ఈ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. చంద్రుని ఆకృతిలో వస్తున్న ఈ మార్పులు భూమిపై ఉన్న సముద్ర అలల మీద ఏవైనా ప్రభావం చూపుతాయా అన్న కోణంలో కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాల్సి ఉంది.
‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అని పాడుకునే మనకు, ఆ చందమామే చిక్కిపోతున్నాడనే వార్త కొంత ఆందోళన కలిగించేదే. ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదన్నట్లుగా, ఖగోళ వస్తువుల్లో కూడా నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి. చందమామపై ఏర్పడుతున్న ఈ 1,114 కొత్త పగుళ్లు విశ్వ రహస్యాలను ఛేదించే క్రమంలో మనకు మరిన్ని పాఠాలు నేర్పుతున్నాయి. ఈ 'స్మాల్ మేర్ రిడ్జెస్' వెనుక ఉన్న అసలు నిగూఢతను ఛేదించినప్పుడే, చంద్రుని పుట్టుక మరియు అంతం గురించి మనకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. నిరంతర పరిశోధనలే జాబిల్లి భవిష్యత్తుకు మార్గదర్శకాలు.
