Begin typing your search above and press return to search.

వైఎస్సార్ బెస్ట్ ఫ్రెండ్ బాబుకు గుడ్ ఫ్రెండ్ !

అంటే బాబు సీఎం అయిన తరువాత గత ఏడాది జూన్ 2కే వచ్చిన నైరుతి రుతుపవనాలు ఇపుడు ఏకంగా మే 26 నాటికే రావడం అంటే శుభ పరిణామం అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 May 2025 7:02 PM IST
వైఎస్సార్ బెస్ట్ ఫ్రెండ్ బాబుకు గుడ్ ఫ్రెండ్  !
X

చంద్రబాబు మీద చాలా విమర్శలు రాజకీయ ప్రత్యర్ధులు చేస్తూ వచ్చారు. అందులో ఆయన వ్యవసాయం దండుగ అన్నారని కూడా అప్పట్లో ప్రచారం చేశారు. నిజానికి చంద్రబాబు అలా అనలేదని చాలా సార్లు చెప్పుకున్నా అదే జనంలోకి వెళ్ళిపోయింది.

ఇక బాబూ కరవూ కవల పిల్లలు అంటూ మరో ప్రచారం కూడా పెద్ద ఎత్తున రాజకీయ ప్రత్యర్ధులు చేశారు. బాబు హయాంలో కొన్ని సార్లు అనావృష్టి వచ్చిన మాట వాస్తవం. అయితే అదే సమయంలో దేశమంతా ఆ రకమైన పరిస్థితి ఉంది అన్నది మరచారు. ఇంకా చెప్పాలీ అంటే ప్రకృతి విపరిణామాల వల్ల ప్రపంచంలోనే చాలా చోట్ల పరిస్థితులు తారు మారు అవుతూ వస్తున్నాయి.

అయినా ఆ నింద బాబుకే అంటకట్టారు. అయితే బాబు పొలిటికల్ లైఫ్ లో ఫస్ట్ టైం ఇంకా చెప్పాలంటే చాలా ఏళ్ళ తరువాత తొలిసారి మే 26 నాటికి నైరుతి పవనాలు ఏపీలో ప్రవేశించాయి. ఇది నిజంగా గొప్పగానే చెప్పుకోవాలని అంటున్నారు. ఇటీవల కాలంలో ఇంత ఎర్లీగా రుతు పవనాలు ఏపీలో ఎపుడూ ప్రవేశించలేదు అని కూడా వాతావరణ నిపుణులు అంటున్నారు.

ఎపుడూ జూన్ మూడో వారానికి కానీ ఏపీకి నైరుతి రుతు పవనాలు రాలేదని ఒక డేటా కూడా ముందుంచుతున్నారు. 2019లోనే చూసుకుంటే ఏపీకి నైరుతి పవనాలు జూన్ 20న వచ్చాయి. 2020లో చూస్తే జూన్ 7న వచ్చాయి. 2021లో చూస్తే జూన్ 4న వచ్చాయి. 2022లో చూస్తే జూన్ 13న వచ్చాయి. 2023లో జూన్ 13న వచ్చాయి, 2024లో జూన్ 2న వచ్చాయి.

అంటే బాబు సీఎం అయిన తరువాత గత ఏడాది జూన్ 2కే వచ్చిన నైరుతి రుతుపవనాలు ఇపుడు ఏకంగా మే 26 నాటికే రావడం అంటే శుభ పరిణామం అని అంటున్నారు. అంతే కాదు వరుణుడు బాబుకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు అని చెబుతున్నారు. గతంలో వైఎస్సార్ అయితే వరుణుడు కాంగ్రెస్ కి నేస్తం అని వ్యాఖ్యానించేవారు.

ఇపుడు బాబు హయాంలో చాలా ముందుగా నైరుతి రుతు పవనాలు ఏపీకి వచ్చాయి అంటే కచ్చితంగా బాబుకే వరుణుడు ఫ్రెండ్ అని చెప్పాలి కదా అని అంటున్నారు. భారత్ లాంటి దేశాలలో నైరుతి రుతు పవనాలే దేశ ఆర్ధికాభివృద్ధిని నిర్ణయిస్తాయి. విస్తరంగా వానలు కురిసి పంటలు పండితే ఆర్ధిక అభివృద్ధి జరుగుతుంది. అంతే కాదు జీడీపీ కూడా పెరుగుతుంది. అందుకే నైరుతి రుతు పవనాల మీద ఆర్ధిక వేత్తలు సహా అందరూ ఆసక్తిని చూపిస్తారు.

అలాంటిది ఈసారి ఏపీలో వానలే వానలు అన్నట్లుగా సీన్ కనిపిస్తోంది. అంతే కాదు రోళ్ళు బద్ధలు కొట్టే రోహిణి కార్తెలలో నైరుతి ఎంట్రీ ఇవ్వడంతో ఏపీ అంతా ఏసీ అయిపోయింది అని అంటున్నారు. దాని వల్ల విద్యుత్ వాడకం కూడా తగ్గి ఏపీకి మరో విధంగా లాభంగా ఉందని అంటున్నారు. ఇవన్నీ ప్రకృతి ఏపీ కూటమి ప్రభుత్వాన్ని దీవించింది అని అనడానికి సంకేతాలు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఏపీకి నైరుతి రుతుపవనాల రాకపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోషల్ మీడియా ద్వారా ట్వీట్‌ చేశారు. మేలోనే నైరుతి పలకరింపు శుభపరిణామం అని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురవాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ఆకాంక్షించారు. ఏది ఏమైనా బాబు సీఎం అయితే కరవు అన్న వాళ్ళ నోళ్ళు మూతపడేలా వానదేవుడు చాలా ముందే వచ్చి మేలు చేశారు అని అంటున్నారు అంతా.