Begin typing your search above and press return to search.

ముందే అందిన మేఘ సందేశం.. కానీ వర్షాలు సందేహం?

దేశవ్యాప్తంగా భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కల్పిస్తూ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

By:  Tupaki Political Desk   |   4 Jun 2026 1:57 PM IST
ముందే అందిన మేఘ సందేశం.. కానీ వర్షాలు సందేహం?
X

దేశవ్యాప్తంగా భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కల్పిస్తూ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎటువంటి ఆలస్యం లేకుండా, పెద్దగా ఎదురుచూపులు లేకుండానే ఈ సారి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి. కొద్దిసేపటి క్రితమే కేరళ తీరాన్ని ఇవి తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. కేరళలో రుతుపవనాలు ప్రవేశించడంతో అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఇవి దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడు?

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ రెండో వారంలో ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రుతు పవనాల ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం చల్లబడటమే కాకుండా ఖరీఫ్ సాగుకు వాతావరణం సహకరిస్తుందని అన్నదాతలు ఆశిస్తున్నారు.

‘ఎల్‌నినో’ గుబులు

అయితే రుతుపవనాలు సకాలంలో వచ్చాయనే ఆనందం ఎన్నాళ్లు ఉంటుందో తెలియడం లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఎల్ నినో ప్రభావం ఉండటంతో రుతుపవనాల సీజన్ లో ఆశించినంత వర్షాలు కురవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడాన్ని ‘ఎల్‌నినో’ అంటారు. దీని ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఎల్‌నినో ప్రభావం ఉన్న కాలంలో దేశంలో రుతుపవనాలు బలహీనపడటం, వర్షాలు తగ్గడం లేదా కరవు పరిస్థితులు ఏర్పడటం జరుగుతుందని చెబుతున్నారు.

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం బలంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీనివల్ల జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగే ఈ రుతుపవనాల సీజన్ లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. వర్షాలు కురిసినా అవి అన్ని ప్రాంతాల్లో ఒకేలా కాకుండా, కొన్ని చోట్ల భారీగానూ, చాలా చోట్ల వర్షాభావ పరిస్థితులుగానూ మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. వర్షాలు తగ్గితే జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గి, తాగునీటి సరఫరా, ఖరీఫ్ పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడే చూపే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెద్దగా ఎదురుచూపులు లేకుండానే రుతుపవనాలు రావడం సానుకూల అంశమే అయినప్పటికీ, ‘ఎల్‌నినో’ ముప్పు పొంచి ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా చెబుతోంది. వర్షపు నీటిని పొదుపు చేసుకోవడం, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వంటి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. ఇప్పటికే ఎల్ నినో ఎఫెక్ట్ పై రైతుల్లో అవగాహన పెంచాలని వ్యవసాయ అధికారులకు సూచించింది.