Begin typing your search above and press return to search.

మనీలాండరింగ్ కేసు... ప్రియాంకా గాంధీకి ఈడీ షాక్!

మనీ లాండరింగ్ అభియోగాలతో సంజయ్‌ భండారీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన ఓ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

By:  Tupaki Desk   |   28 Dec 2023 10:52 AM GMT
మనీలాండరింగ్ కేసు... ప్రియాంకా గాంధీకి ఈడీ షాక్!
X

మనీ లాండరింగ్ అభియోగాలతో సంజయ్‌ భండారీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన ఓ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకాగాంధీ పేరు తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఈ మనీ లాండరింగ్ కేసులో తొలిసారిగా ప్రియాంకా గాంధీ పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రస్థావించింది.

అవును... సంజయ్ భండారీ పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో ప్రియాంకా గాంధీ పేరును నిందితురాలిగా పేర్కొనలేదు కానీ... ఆమెతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరును కూడా ఈడీ తాజాగా ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. ఈ కేసులో ప్రధానంగా ప్రియాంక, రాబర్ట్ వాద్రాల పేర్లు ప్రస్థావించడానికి 12 బ్రియాన్ స్టోర్ స్క్వేర్ అనే ఇంటికి సంబంధించి వ్యవహారం కావడం గమనార్హం!

వివరాళ్లోకి వెళ్తే... మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సంజయ్‌ భండారీ.. తన అక్రమ ఆర్జనతో లండన్‌ లో దక్కించుకున్న "12 బ్రియాన్‌ స్టోన్‌ స్క్వేర్‌" అనే ఇంటికి రాబర్ట్‌ వాద్రా మరమ్మతులు చేయించారని.. ఆ ఇంటిలో కొంతకాలం నివాసం కూడా ఉన్నారని ఈడీ తాజాగా ఆరోపించింది. ఈ వ్యవహారంలో బ్రిటన్‌ కు చెందిన సుమిత్‌ చడ్ఢా అనే వ్యక్తి.. వాద్రాకు సహకరించారని పేర్కొంది.

ఈ విషయాలపై స్పందించిన ఈడీ... బ్రిటన్‌ కు చెందిన సుమిత్‌ తో పాటు రాబర్ట్ వాద్రాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన చెరువథుర్‌ థంపిపై తాజా అభియోగపత్రం దాఖలు చేశామని వెల్లడించింది. ఇదే సమయంలో ఢిల్లీకి చెందిన ఒక రియల్‌ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా రాబర్ట్ వాద్రా దంపతులు హరియాణాలో వ్యవసాయ భూమిని దక్కించుకున్నారని ఈడీ ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొంది.

ఇదే సమయంలో... 2006లో ఫరీదాబాద్‌ లో ఆ భూమిని కొనడం, అనంతరం 2010లో ఆ భూమిని అదే ఏజెంట్ కు విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. ఇదే క్రమంలో సదరు ఏజెంట్ ఆ భూమిని చెరువథుర్‌ థంపికి కూడా విక్రయించాడని ఈడీ తెలిపింది.

కాగా... ఈ మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సంజయ్ భండారీ... 2016లోనే బ్రిటన్‌ కు పారిపోయారు! దీంతో... అతడిని వెనక్కి తీసుకొచ్చేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తోపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చేసిన వినతికి బ్రిటన్‌ సర్కారు ఈ ఏడాది జనవరిలో ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించిన ఛార్జ్ షీట్ లో తాజాగా రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీల పేర్లు చేర్చింది ఈడీ!