అప్పట్లో ఆర్థిక సంక్షోభం.. ఇప్పుడు బిలియనీర్ల కేరాఫ్ అడ్రస్!
బిలియనీర్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ దేశం ఫ్రాన్స్ కు ఆగ్నేయంగా ఉన్న మధ్యధరా తీర ప్రాంతం ఉండే చిన్న దేశంగా చెప్పాలి.
By: Tupaki Desk | 29 May 2025 10:30 AM ISTఏ వీధిలో చూసినా ఖరీదైన కార్లు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు వాడే విలాసవంతమైన కార్లు.. ఆ దేశంలోని ప్రతి గల్లీలోనూ కనిపిస్తాయి. ఆ దేశ నగరాన్ని చూస్తే.. ఏదో భారీ మూవీ సెట్టింగ్ లా ఉంటుందే తప్పించి.. రియల్ లైఫ్ లో ఇంతటి సంపన్న నగరమా? అన్న భావన కలగటం ఖాయం. ఏదో మాట వరసకు ఆ ఫీలింగ్ కాదు.. ఆ దేశంలో వేసే ప్రతి అడుగులోనూ ఈ విషయాన్ని నిజమని చెప్పే బోలెడన్ని ఉదంతాలు అక్కడ పోగుపడినట్లుగా ఉంటాయి. ఇంత బిల్డప్ ఇస్తున్నారు? ఇదే దేశం? ఇదెక్కడ ఉంది? ఒకప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఒక చిన్న దేశం.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారింది. అదే.. మొనాకో.
బిలియనీర్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ దేశం ఫ్రాన్స్ కు ఆగ్నేయంగా ఉన్న మధ్యధరా తీర ప్రాంతం ఉండే చిన్న దేశంగా చెప్పాలి. ఎక్కడ చూసినా విలాసవంతమైన భవంతులు..ఖరీదైన కార్లు.. తీరంలో కళ్లు చెదిరే యాట్ లే కనిపిస్తాయి. లగ్జరీ లైప్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ దేశంలో తమకో అడ్రస్ ఉండాలని సంపన్నులు అదే పనిగా ప్రయత్నిస్తుంటారని చెబుతారు. ఎందుకింత క్రేజ్ అంటే.. ఆ దేశంలోని జీవన విధానం మాత్రమే కాదు.. ఆదాయపన్ను లేకుండా ఉండటం కూడా ఒక కారణం.
ఇప్పుడు ఇంతలా ఉన్న ఈ చిన్న దేశం 19వ శతాబ్దం మొదట్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో మాంటే కార్లో క్యాసినో ఏర్పాటు చేస్తూ ప్రిన్స్ చార్లెస్ 1 తీసుకున్న నిర్ణయం మొనాకో తలరాతనే మార్చేసింది. దీనికి తోడు ఆదాయపన్ను రద్దు చేయటం సంపన్నుల్ని అమితంగా ఆకర్షించింది. ఫ్రాన్స్ పౌరులకు మినహా మరెవ్వరికీ అక్కడ ఆదాయపన్ను ఉండటకపోవటం.. దీనికి సంబంధించి 1869లో జరిగిన ఒప్పందం ఆ దేశాన్ని మరో లెవల్ వెళ్లేలా చేసిందని చెప్పాలి.
ఇప్పుడు ఆ దేశ జనాభా కేవలం 38 వేలు మాత్రమే. ప్రపంచంలో ఎక్కడా లేనంత మిలియనీర్లు ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడ స్థిరనివాసం కోసం సంపన్నులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. మరికొందరు అయితే అద్దె నివాసం ఉన్నా ఫర్లేదనుకుంటారు. సంపన్నులకు ఈ దేశం అంతటి క్రేజ్ గా చెప్పాలి. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం ఇక్కడవారి తలసరి జీడీపీ 2.56 లక్షల డాలర్లు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.2.18 కోట్లు. అమెరికా తలసరి ఆదాయం 82 వేల డాలర్లు. అంటే.. దగ్గర దగ్గర అమెరికా తలసరి ఆదాయం కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా చెప్పాలి.
ఈ దేశంలో నివసించే ప్రతి ముగ్గురిలో ఒకరు బిలియనీర్లుగా చెబుతారు. ఈ దేశానికి సంపన్నులు క్యూ కట్టటం వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయి. భద్రతా పరంగా సురక్షిత ప్రాంతం కావటం.. అంతర్జాతీయ స్కూళ్లు.. ఆసుపత్రులతో పాటు ఆదాయపన్ను అన్నదే లేకుండా ఉండటం ఇందుకు కారణాలుగా చెప్పాలి. వారసత్వ పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొందరికి ఉన్నా గరిష్ఠంగా 16 శాతం మాత్రమే ఉంటుంది. రాజకీయ స్థిరత్వం.. ఉన్నత జీవనప్రమాణాలు సంపన్నులు మొనాకో వైపు చూసేందుకు కారణంగా మారాయని చెప్పాలి.
డబ్బులు ఉండగానే మొనాకోకు వెళ్లటం అంత సులువు కాదు. అక్కడ ఇంటిని ఏర్పాటు చేసుకోవాలన్నా.. ఆదాయపన్ను ప్రయోజనాల్ని పొందాలన్నా కొన్ని కఠిన నిబంధనలకు ఓకే కావాల్సిందే. కనీసం 16 ఏళ్లు ఉండటం.. ఎలాంటి నేర చరిత్ర లేదన్న పోలీసుల ధ్రువీకరణ చాలా అవసరం. అప్పుడు మాత్రమే సొంతిళ్లు కానీ.. అద్దెకు నివాసాన్ని ఓకే చేస్తారు. అంతేకాదు.. ఆర్థికంగా తాము ఎంత బలవంతులమన్న విషయాన్ని నిరూపించుకోవటంతో పాటు.. ఏడాదిలో ఆర్నెల్ల కంటే ఎక్కువ కాలం అక్కడే ఉండాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ కాలం ఆ దేశంలో ఉండాలంటే కూడా అందుకు అదనపు పత్రాలు అవసరమవుతాయి. ఇంతటి నిబంధనల్ని పాటించటంతోనే ఈ దేశం సంపన్నులకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పాలి.