అమెరికాలో ప్రజలపై ఫైర్ బాంబ్... ఎఫ్.బీ.ఐ. కీలక వ్యాఖ్యలు!
అమెరికాలోని కొలరాడోలో ఆదివారం ఇజ్రాయెల్ బందీల జ్ఞాపకార్థం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుమిగూడిన ప్రజలపై ఓ వ్యక్తి మోలోటోవ్ కాక్ టెయిల్స్ విసిరి, తాత్కాలిక ఫ్లేమ్ త్రోవర్ ను ఉపయోగించారు.
By: Tupaki Desk | 2 Jun 2025 9:48 AM ISTఅమెరికాలోని కొలరాడోలో ఆదివారం ఇజ్రాయెల్ బందీల జ్ఞాపకార్థం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుమిగూడిన ప్రజలపై ఓ వ్యక్తి మోలోటోవ్ కాక్ టెయిల్స్ విసిరి, తాత్కాలిక ఫ్లేమ్ త్రోవర్ ను ఉపయోగించారు. ఈ ఘటనలో కనీసం ఆరుగురు గాయపడ్డారు. దీనిపై స్పందించిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది!
అవును... గాజాలో ఇప్పటికీ ఉన్న ఇజ్రాయెల్ బందీలను స్మరించుకునేందుకు అమెరికాలోని కొలరాడ్ లో నిర్వహించిన ర్యాలీలో ఓ వ్యక్తి కాక్ టెయిల్స్ విసిరి, ఫ్లేమ్ త్రోవర్ ను ప్రయోగించారు. అతడు అలా ప్రజలకు నిప్పంటిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని బౌల్టర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్ ఫెర్న్ తెలిపారు.
ఈ సందర్భంగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 45 ఏళ్ల మొహమ్మద్ సబ్రీ సోలిమాన్ గా గుర్తించబడిన ఆ వ్యక్తి జనంపై దాడి చేస్తూ "జియోనిస్టులను చంపండి.. పాలస్తీనాను విడిపించండి.. ఫ్రీ పాలస్తీనా" అని అరిచినట్లు చెబుతున్నారు. దాడి తర్వాత అతనితో కొంతమంది తలపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు తెరపైకి వచ్చాయి!
బౌల్టర్ లో జరిగిన ప్రదర్శనలో ప్రజలపై దాడి చేసిన తర్వాత సోలిమాన్ షర్ట్ లేకుండా తన చేతుల్లో ద్రవంతో నిండిన సీసాలు పట్టుకుని ఉన్నట్లు చూపించే అనేక వీడియోలు వైరల్ అయ్యాయి! ఈ క్రమంలో అతడి చేతికి ఓ పోలీసు అధికారి బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు. దాడిలో అతడు తాత్కాలిక ఫ్లేమ్ త్రోవర్ ను ఉపయోగించాడని ఓ అధికారి తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన ఎఫ్.బీ.ఐ. చీఫ్ కాష్ పటేల్.. దీనిని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకోవాల్సి ఉందని తెలిపారు! దీనిపై స్పందించిన కొలరాడో అటార్నీ జనరల్ ఫిల్ విజర్... ఈ దాడిని బట్టి చూస్తే ఇది ద్వేషపూరిత నేరంగా కనిపిస్తోందని అన్నారు. అదనపు అనుమానితులు లేరని పోలీసులు వెల్లడించారు.
కాగా... ఇజ్రాయెల్ - హమాస్ మధ్య మరింత తీవ్రమవుతున్న యుద్ధం కారణంగా అమెరికాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో ఇజ్రాయెల్ మద్దతుదారులు, పాలస్తీనా అనుకూల గ్రూపుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం అమెరికాలో కనిపిస్తోంది. ఇప్పటికే పాలస్తీనా అనుకూల నిరసనలను యూదు వ్యతిరేకంగా ట్రంప్ అభివర్ణించారు.
ఇక గత నెలలో వాషింగ్టన్ డీసీలోని కాపిటల్ యూదు మ్యూజియం వెలుపల ఓ వ్యక్తి ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సిబ్బందిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో "ఫ్రీ పాలస్థీనా" అంటూ అతడు నినాదాలు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
