ఇరాన్ సుప్రీం లీడర్ బతికి లేడన్న ఇజ్రాయెల్.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్.. ఏదినిజం?
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రతరం కావడంతో ఇరాన్ కీలక నాయకుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
By: A.N.Kumar | 20 March 2026 12:50 PM ISTఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వారసుడిగా భావిస్తున్న మొజ్తబా ఖమేనీ ప్రస్తుత స్థితిగతులపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు చేసిన సంచలన వ్యాఖ్యలు ఒకవైపు ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన అస్పష్టమైన వీడియో మరోవైపు ప్రపంచ దేశాలను అయోమయంలో నెట్టేస్తున్నాయి.
నెతన్యాహు సంచలన ఆరోపణలు
ఇటీవల విదేశీ మీడియాతో మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు ఇరాన్ అగ్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరాన్ పాలనా యంత్రాంగం ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉందో కూడా తెలియని గందరగోళం నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మొజ్తబా ఖమేనీ గురించి ప్రస్తావిస్తూ "ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన మరణించి ఉండవచ్చు లేదా ప్రాణాపాయ స్థితిలో ఉండి ఉండవచ్చు" అని నెతన్యాహు అనుమానం వ్యక్తం చేశారు. ఇరాన్ రాజకీయాల్లో సైనిక విభాగాల్లో అంతర్గత కలహాలు మొదలయ్యాయని, ఇది ఆ దేశ అస్థిరతకు సంకేతమని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ కౌంటర్: ఆ వీడియో వెనుక మిస్టరీ ఏమిటి?
నెతన్యాహు వ్యాఖ్యలు కార్చిచ్చులా వ్యాపించడంతో, ఇరాన్ అధికారిక ప్రసార సంస్థ ఐఆర్ఐబీ (ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్ కాస్టింగ్ ) రంగంలోకి దిగింది. మొజ్తబా ఖమేనీ క్షేమంగానే ఉన్నారని నిరూపించే ప్రయత్నంలో భాగంగా ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మొజ్తబా కొంతమంది విద్యార్థులకు మతపరమైన శాస్త్రాలను బోధిస్తూ కనిపించారు. విశేషమేమిటంటే మొజ్తబా ఖమేనీకి సంబంధించి అధికారికంగా విడుదలైన తొలి వీడియో ఇదే కావడం గమనార్హం. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారు అనే విషయంపై ఇరాన్ స్పష్టత ఇవ్వలేదు. డేట్ స్టాంప్ లేదా సమకాలీన అంశాల ప్రస్తావన లేకపోవడంతో ఇది పాత వీడియో కావచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
అనుమానాలకు బలం చేకూరుస్తున్న పరిస్థితులు
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రతరం కావడంతో ఇరాన్ కీలక నాయకుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలు ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో మొజ్తబా కనిపించకపోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. "కేవలం వీడియోను విడుదల చేయడం వల్ల నిజం నిరూపితం కాదు. ఇరాన్ తన నాయకత్వం సురక్షితంగా ఉందని లోకానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది.. కానీ పారదర్శకత లేకపోవడం వల్ల అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి." అని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.
నిజం ఎప్పుడు బయటపడుతుంది?
మొజ్తబా ఖమేనీ నిజంగానే ఇజ్రాయెల్ దాడులకు గురయ్యారా? లేక కేవలం భద్రతా కారణాల దృష్ట్యా అజ్ఞాతంలో ఉన్నారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇరాన్ అంతర్గత రాజకీయాలు అత్యంత రహస్యంగా సాగుతాయి కాబట్టి ఆ దేశం నుండి అధికారికంగా మరో బలమైన సాక్ష్యం వచ్చే వరకు లేదా అంతర్జాతీయ గూఢచారి సంస్థల నివేదికలు బయటపడే వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.
