Begin typing your search above and press return to search.

వారసత్వ రాజకీయాల్లోకి ఇరాన్: సుప్రీం పీఠాన్ని అధిష్టించిన మొజ్తాబా ఖమేనీ.. ఎదురుచూస్తున్న సవాళ్లు ఏమిటి?

ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థలో 'వారసత్వ' పాలనకు చోటు లేదని గతంలో అనేకసార్లు చర్చలు జరిగినప్పటికీ మొజ్తాబా ఎంపికతో ఆ వాదన పక్కకు పోయింది.

By:  A.N.Kumar   |   9 March 2026 11:22 AM IST
వారసత్వ రాజకీయాల్లోకి ఇరాన్: సుప్రీం పీఠాన్ని అధిష్టించిన మొజ్తాబా ఖమేనీ.. ఎదురుచూస్తున్న సవాళ్లు ఏమిటి?
X

ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థలో 'వారసత్వ' పాలనకు చోటు లేదని గతంలో అనేకసార్లు చర్చలు జరిగినప్పటికీ మొజ్తాబా ఎంపికతో ఆ వాదన పక్కకు పోయింది. 1979 విప్లవం తర్వాత రాచరికాన్ని కూలదోసి ఏర్పడిన ఈ వ్యవస్థలో మళ్ళీ తండ్రి తర్వాత కుమారుడు అధికారంలోకి రావడం ఒక విలక్షణమైన పరిణామం.

ఇరాన్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. దేశ కొత్త సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఎన్నికైనట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 88 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అనే అత్యున్నత మత–రాజకీయ సంస్థ ఆయనను కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నట్లు వెల్లడించింది. నిర్ణయాత్మక ఓటింగ్ ప్రక్రియ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మొజ్తాబా ఖమేనీ వయసు 56 సంవత్సరాలు.

ఇరాన్‌లో సుప్రీం లీడర్ పదవి అత్యంత కీలకమైనది. దేశ రాజకీయ, సైనిక, మత పరమైన వ్యవస్థలపై అత్యున్నత అధికారాలు ఈ పదవికి ఉంటాయి. సైన్యం, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ కీలక సంస్థలపై కూడా సుప్రీం లీడర్‌కు పూర్తి ఆధిపత్యం ఉంటుంది. అలాంటి కీలక స్థానానికి మొజ్తాబా ఖమేనీ ఎంపిక కావడం ఇరాన్ రాజకీయాల్లో కొత్త అధ్యాయంగా భావిస్తున్నారు.

ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సభ్యులు మొజ్తాబా ఖమేనీ నాయకత్వాన్ని సమర్థిస్తూ తీర్మానం చేశారు. దేశంలో ఐక్యతను కాపాడుకోవడం కోసం ఆయనకు మద్దతు ఇవ్వాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ భద్రత, ఇస్లామిక్ విలువల పరిరక్షణ, అంతర్జాతీయ రాజకీయాల్లో ఇరాన్ స్థానాన్ని మరింత బలపర్చడం వంటి అంశాల్లో మొజ్తాబా కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మొజ్తాబా ఖమేనీ ఇప్పటివరకు రాజకీయంగా పెద్దగా ప్రజల ముందు కనిపించకపోయినా.. ఇరాన్ మతపరమైన వర్గాల్లో ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన మతపరమైన అధ్యయనాలు చేసి శియా మతపెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే ఇరాన్‌లోని కీలక మత సంస్థల కార్యకలాపాల్లో కూడా పరోక్షంగా పాల్గొంటూ వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అయతుల్లా అలీ ఖమేనీ గత మూడు దశాబ్దాలకుపైగా ఇరాన్ సుప్రీం లీడర్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయన తరువాత వారసత్వంపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మొజ్తాబా ఖమేనీ ఎంపిక కావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కొందరు విశ్లేషకులు ఇది ఇరాన్‌లో ఒక రకంగా వారసత్వ నాయకత్వానికి దారి తీస్తుందని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు మొజ్తాబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ అంతర్జాతీయ రాజకీయాల్లో ఎలా వ్యవహరిస్తుందనే అంశంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో ఉన్న ఉద్రిక్త సంబంధాల నేపథ్యంలో ఆయన విదేశాంగ విధానం ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది.

ఇకపై ఇరాన్‌లో రాజకీయ, మతపరమైన వ్యవస్థలపై మొజ్తాబా ఖమేనీ ప్రభావం ఎలా ఉంటుందన్నది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన నాయకత్వం దేశంలో స్థిరత్వాన్ని కొనసాగిస్తుందా లేదా కొత్త మార్పులకు దారి తీస్తుందా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.