Begin typing your search above and press return to search.

రాబోయే 48 గంటలు అత్యంత కీలకం.. ఖమేనీ ఆరోగ్యంపై భారత ఏజెన్సీల నివేదిక..

మొజ్తబా ఖమేనీకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ తన నియంత్రణలో ఉంచుకుంది.

By:  Tupaki Political Desk   |   15 March 2026 4:00 PM IST
రాబోయే 48 గంటలు అత్యంత కీలకం.. ఖమేనీ ఆరోగ్యంపై భారత ఏజెన్సీల నివేదిక..
X

మొజ్తబా ఖమేనీ మరణించారనే ఊహాగానాలు ప్రపంచ వ్యాప్తంగా జోరందుకున్న సమయంలో, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక సమాచారాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ప్రాణాలతో ఉన్నాడని, అయితే ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని భారత నిఘా వర్గాలు ధృవీకరించాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా, మొజ్తబా గాయపడి కదలలేని స్థితిలో ఉన్నారని సమాచారం. ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, ఆయన శారీరక సామర్థ్యంపై భారత నిఘా వర్గాలు నిరంతరం నిఘా ఉంచాయి.

'ది సన్' సంచలన కథనం!

బ్రిటిష్ వార్తాపత్రిక ‘ది సన్’ ప్రచురించిన కథనం ప్రకారం, మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని, దాడుల వల్ల కలిగిన తీవ్ర గాయాల కారణంగా ఆయన ఒక కాలును (లేదా రెండు కాళ్లను) వైద్యులు తొలగించాల్సి వచ్చిందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పత్రిక పేర్కొంది. మొజ్తబా కాలేయం లేదా జీర్ణాశయం కూడా దెబ్బతిన్నాయని, ప్రస్తుతం సీనా యూనివర్సిటీ ఆసుపత్రిలోని రహస్య విభాగంలో భద్రత మధ్య చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఈ వార్తలు ఇరాన్ ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

కఠిన ఆంక్షలు!

మొజ్తబా ఖమేనీకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ తన నియంత్రణలో ఉంచుకుంది. ఆయన చికిత్స తీసుకుంటున్న ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్న ఐఆర్జీసీ, కమ్యూనికేషన్లపై కఠినమైన ఆంక్షలు విధించింది. సుప్రీం లీడర్ ఆరోగ్యం గురించిన నెగటివ్ సమాచారం బయటకు వస్తే దేశంలో అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉందని, లేదా శత్రు దేశాలు ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని మరిన్ని దాడులు చేస్తాయని ఐఆర్జీసీ భావిస్తోంది. అందుకే ఆయనకు సంబంధించిన సమాచారాన్ని కేవలం పరిమితంగా, అది కూడా కేవలం రాతపూర్వక సందేశాల రూపంలోనే విడుదల చేస్తోంది.

కనపడని నేత

సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మొజ్తబా ఖమేనీ ఎక్కడా బహిరంగంగా కనిపించకపోవడం లేదంటే వీడియో సందేశం ఇవ్వకపోవడం పలు అనుమానాలను బలపరుస్తోంది. ఇటీవల ఆయన పేరుతో విడుదలైన మొదటి సందేశం కూడా ఒక న్యూస్ రీడర్ ద్వారా చదవడమే తప్ప, ఆయన ప్రత్యక్షంగా మాట్లాడలేదు. మార్చి 9న జరిగిన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన కనపడలేదు. ఇరాన్ స్టేట్ మీడియా ఆయనను ‘జన్బాజ్’ (యుద్ధంలో గాయపడిన వీరుడు) అని సంబోధించడం గమనార్హం. ఇది ఆయన తీవ్రంగా గాయపడ్డారనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొజ్తబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నారనే భారత నిఘా వర్గాల రిపోర్ట్ ఇరాన్ కు కొంత ఊరటనిచ్చినప్పటికీ, ఆయన కదలలేని స్థితిలో ఉండడం పాలనపై ప్రభావం చూపుతోంది. సుప్రీం లీడర్ బలహీనంగా ఉన్నారనే వార్త ప్రజల్లో లేదంటే సైన్యంలో అసంతృప్తికి దారితీయకుండా ఐఆర్జీసీ జాగ్రత్త పడుతోంది. ఒక అదృశ్య నేత ఎంతకాలం దేశాన్ని నడిపించగలరనేది ప్రధాన ప్రశ్న. యుద్ధం తీవ్రమవుతున్న వేళ, ఖమేనీ ఆరోగ్య స్థితిని గోప్యంగా ఉంచడం ద్వారా ఇరాన్ తన పట్టు కాపాడుకోగలదా లేక ఇది మరింత గందరగోళానికి దారితీస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.