Begin typing your search above and press return to search.

భారత్‌ కు మాల్దీవులు మాజీ అధ్యక్షుడు క్షమాపణలు!

ఈ నేపథ్యంలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశ ప్రజల తరఫున భారత్‌ కు క్షమాపణలు తెలియజేస్తున్నానని తెలిపారు.

By:  Tupaki Desk   |   9 March 2024 7:37 AM GMT
భారత్‌ కు మాల్దీవులు మాజీ అధ్యక్షుడు క్షమాపణలు!
X

హిందూ మహా సముద్రంలో భారత్‌ కు అత్యంత సమీపాన ఉన్న బుల్లి దేశం.. మాల్దీవులు. దశాబ్దాల తరబడి భారత్‌ తో స్నేహ సంబంధాలు నెరిపిన ఈ దేశం ఇటీవల కాలంలో చైనాకు బాగా దగ్గరవుతోంది. ముఖ్యంగా గతేడాది మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌ అనుకూలవాది అయిన మహ్మద్‌ నషీద్‌ ఓడిపోయి చైనా అనుకూలవాది అయిన మహ్మద్‌ ముయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఇక అప్పటి నుంచి భారత్‌ కు వ్యతిరేకంగా మాల్దీవుల అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. మాల్దీవుల్లో రాడార్, నౌకా కేంద్రాల్లో సహాయం అందించడానికి ఉన్న భారత్‌ సిబ్బందిని దేశం విడిచి వెళ్లిపోవాలని ముయిజ్జు కోరారు. మే 10 తర్వాత భారత్‌ కు చెందిన ఒక్క మిలిటరీ సిబ్బంది కూడా తమ భూభాగంలో ఉండకూదని ఆల్టిమేటం జారీ చేశారు. కనీసం సివిల్‌ డ్రెస్సుల్లో కూడా ఇక్కడ సంచరించడానికి ఒప్పుకోబోమన్నారు.

అలాగే కొలంబో భద్రతా సహకార సమితి సమావేశాలకు కూడా ముయిజ్జు హాజరు కాలేదు. ఇందులో భారత్, శ్రీలంక, మారిషష్, మాల్దీవులు సభ్యులుగా ఉన్నాయి. అలాగే సముద్ర గర్భంలో పరిశోధనలకు భారత్‌ తో కుదుర్చుకున్న గడువును కూడా తాము పునరుద్ధరించుకోబోమని ముయిజ్జు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశ ప్రజల తరఫున భారత్‌ కు క్షమాపణలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న ఆయన భారతీయులు తమ దేశానికి రావాలని విన్నవించారు.

ఈ దౌత్యవివాదం, బాయ్‌కాట్‌ పిలుపు వల్ల మాల్దీవులపై తీవ్ర ప్రభావం పడిందని నషీద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మాల్దీవుల ప్రజల తరఫున భారత్‌ కు క్షమాపణలు చెప్తున్నానన్నారు. ఈ సెలవులకు భారతీయులు తమ దేశానికి రావాలని విన్నవించారు. ఎప్పటిలాగే తమ ఆతిథ్యం ఉంటుందని చెప్పారు. దానిలో ఎలాంటి మార్పు ఉండదని హామీ ఇచ్చారు.

భారత దళాలు తమ దేశం విడిచివెళ్లాలని అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు కోరినప్పుడు.. భారత్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని నషీద్‌ కొనియాడారు. తన బలాన్ని ప్రదర్శించాలని అనుకోలేదన్నారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి మొగ్గుచూపి సంయమనం పాటించిందన్నారు.

అలాగే ఇటీవల మాల్దీవులు–చైనా మధ్య జరిగిన సైనిక సహకార ఒప్పందం గురించి మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ మాట్లాడుతూ.. రబ్బర్‌ బుల్లెట్లు, టియర్‌ గ్యాస్‌ వంటి కొన్ని పరికరాలను ముయిజ్జు కొనుగోలు చేయాలనుకుంటున్నారని.. అవి అవసరమని ఆయన భావించడం దురదృష్టకరమన్నారు.

కాగా ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటనను ఎగతాళి చేస్తూ మాల్దీవులు అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. బాయ్‌ కాట్‌ మాల్దీవులు పేరుతో భారతీయులు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 33 శాతం మంది భారతీయ పర్యాటకులు తగ్గిపోయారు. ఆ దేశాన్ని సందర్శిస్తున్నవారిలో భారతీయులే అత్యధికం. ఇప్పుడు భారతీయులు తగ్గిపోవడంతో చైనా మొదటి స్థానంలోకి వచ్చింది.