టీమిండియా స్టార్‌కు షాక్.. భార్యకు నెల 4 లక్షల భరణం కట్టాల్సిందే!
మొహమ్మద్ షమీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో ప్రదర్శన తర్వాత షమీ స్టార్ అయిపోయాడు.
By: Tupaki Desk | 2 July 2025 9:17 AM ISTపాపం టీమ్ ఇండియా స్టార్ పేసర్..! ఫామ్ బాగున్నా పరిస్థితులు కలిసిరావడం లేదు..! దేశానికి ఎంతో అద్భుత ప్రతిభతో విజయాలు అందించిన అతడికి కష్ట కాలం నడుస్తోంది..! గాయంతో జాతీయ జట్టుకు దూరం కావడమే కాక.. ఐపీఎల్‌లోనూ విఫలమయ్యాడు. తిరిగి లయ అందుకుంటాడో లేదో తెలియని సందిగ్ధం.. ఇలాంటి సమయంలో కోర్టు భారీ షాక్ ఇచ్చింది.
మొహమ్మద్ షమీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో ప్రదర్శన తర్వాత షమీ స్టార్ అయిపోయాడు. కేవలం ఫైనల్లో జట్టు ఓడిపోయింది. లేదంటే దేశానికి హీరో అయిపోయేవాడు. అయితే, ప్రపంచకప్ తర్వాత మోకాలి గాయం అతడిని జట్టుకు దూరం చేసింది. దాన్నుంచి కోలుకుని టీమ్ ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా రాణించలేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా విఫలమయ్యాడు. అయినా.. షమీని తక్కువ చేయడానికి ఏమీ లేదు. అతడు గనుక మంచి రిథమ్‌తో ప్రస్తుత ఇంగ్లండ్ టూర్‌కు అందుబాటులో ఉండి ఉంటే కథ వేరేలా ఉండేది. కెరీర్‌పరంగా ఇలా ఉండగా వ్యక్తిగతంగా షమీని ఎప్పటినుంచో వెంటాడుతున్న కేసులో అతడికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
యూపీకి చెందిన షమీ.. రంజీట్రోఫీలో పశ్చిమబెంగాల్‌కు ఆడేవాడు. ఆ సమయంలో హసీన్ జహాన్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ 2018కి ముందే విడిపోయారు. ఆ సమయంలో షమీపై జహాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. షమీ అన్న, అమ్మ తనను తీవ్రంగా వేధించారని తెలిపింది. చివరకు కోర్టులో విడాకుల కేసు వరకు వెళ్లింది.
తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భార్య హసీన్ జహాన్, కుమార్తె ఐరాలకు షమీ నెలకు రూ.4 లక్షలను నిర్వహణ ఖర్చుల కింద చెల్లించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఇందులో హసీన్‌కు రూ.లక్షన్నర, మిగతాది ఐరా అని పేర్కొంది. అయితే, ఈ డబ్బును ఏడేళ్ల నుంచి అంటే.. షమీపై జహాన్ కేసు వేసినప్పటి నుంచి వసూలు చేయాలని తీర్పు ఇచ్చింది. వీరి కేసును ఆరు నెలల్లో ముగించాలని కింది కోర్టును ఆదేశించింది.
కాగా, షమీ, హసీన్ జహాన్ 2014లో పెళ్లి చేసుకున్నారు. 2015లో వీరికి పాప పుట్టింది. కొద్ది రోజులకే స్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. 2018లో షమీపై జహాన్ గృహ హింస ఆరోపణలు చేసింది. పోలీసుల వద్దకు వెళ్లింది. రెండేళ్ల కిందట హసీన్‌కు రూ.50 వేలు, ఐరాకు రూ.80 వేలు చొప్పున ఇవ్వాలని షమీని జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశించింది. దీనిపై ఆమె హైకోర్టుకు వెళ్లారు. తాజాగా తీర్పు వచ్చింది.
షమీని ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు సన్ రైజర్స్ రూ.10 కోట్లకు పైగా ధరతో తీసుకుంది. షమీ.. బీసీసీఐ ఎ గ్రేడ్ క్రికెటర్. ఏడాదికి రూ.5 కోట్లు చొప్పున వస్తాయి. మ్యాచ్ ఫీజులు, ఇతర ఎండార్స్‌మెంట్లు అదనం. షమీ యూపీలోనే నివసిస్తున్నాడు. భారీ బంగ్లా కట్టుకున్నాడు. కుమార్తె కూడా తనతోపాటే ఉంటున్నట్లు తెలుస్తోంది.
