Begin typing your search above and press return to search.

తిరుమలకు మోడీ...ఎందుకంటే...!

ఈ నెల 30న అక్కడ కూడా పోలింగ్ తో అయిదు రాష్ట్రాల ఎన్నికలూ పరిసమాప్తం అవుతాయి.

By:  Tupaki Desk   |   21 Nov 2023 8:52 AM GMT
తిరుమలకు మోడీ...ఎందుకంటే...!
X

దేశ ప్రధాని నరేంద్ర మోడీకి దైవ భక్తి కూడా హెచ్చు. ఆయన తరచూ ఉత్తరాదిన అనేక ఆలయాలను సందర్శిస్తారు. దేవీ దేవతలకు మొక్కుతారు. అదే విధంగా ఆయన తిరుమలేశున్ని కూడా దర్శించుకోవడానికి వస్తూంటారు. అయితే మోడీ తిరుమల వచ్చి చాలా కాలమే అయింది.

ఆయన అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఉత్తరాదిన మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్ అలాగే మిజోరాం ఎన్నికలు పూర్తి అయ్యాయి. రాజస్థాన్ లో ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మిగిలింది తెలంగాణా మాత్రమే. ఈ నెల 30న అక్కడ కూడా పోలింగ్ తో అయిదు రాష్ట్రాల ఎన్నికలూ పరిసమాప్తం అవుతాయి.

దాంతో రానున్న నాలుగు రోజుల పాటు మోడీ తెలంగాణాలో వరసగా జరిగే సభలలో ప్రసంగించనున్నారు. ఆ మీదట ఆయన ఏపీకి వస్తారని తెలుస్తోంది. ఆయన ఈ నెల 26న రాత్రికి తిరుమల చేరుకుంటారని అధికార వర్గాల సమాచారం.

మోడీ ఈ నెల 27న స్వామి వారిని దర్శించుకుంటారని తెలుస్తోంది. అంటే మొత్తం అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న మీదట మోడీ ఆ ఏడు కొండల వాడి సన్నిధిలో గడుపుతారని అంటున్నారు. మోడీ తిరుమల రాక విషయంలో ఇప్పటికే జిల్లా అధికారులకు సమాచారం అందింది.

మోడీ ఈ నెల 26న తిరుమలలో బస చేయనున్నారు. దాంతో ఆయన బస చేసే గెస్ట్ హౌజ్ తో పాటు దాని పరిసరాలలో చేపట్టాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లను పోలీసులు చూస్తున్నారు. ఇక మోడీ ఈ నెల 27న శ్రీవారిని దర్శించుకుని నేరుగా ఢిల్లీకి బయల్దేరి వేళ్తారని అధికార వర్గాల తాజా సమాచారం.

ఇదిలా ఉంతే మోడీ తిరుమల వస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తిరుమల వస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది. గతంలో ముఖ్యమంత్రి స్వయంగా తిరుమల వచ్చి ప్రధానికి స్వాగతం పలికారు. ఇద్దరూ కలసే శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈసారి కూడా జగన్ మోడీకి స్వాగతం పలికేందుకు ఈ నెల 26న తిరుపతికి వస్తారని అంటున్నారు. ఒక రోజు రాత్రి మోడీ తిరుమలలో బస చేయనున్న నేపధ్యంలో ప్రధానితో ముఖ్యమంత్రి ప్రత్యేక భేటీ అవుతారా అన్నది కూడా చూడాల్సి ఉంది. రాష్ట్రానికి ప్రధాని వస్తున్న నేపధ్యంలో ఏపీ సమస్యల గురించి ముఖ్యమంత్రి నివేదించడం సంప్రదాయం. కాబట్టి జగన్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు అని అంటున్నారు.