Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ ఈ 65 ఎంపీలకు సీట్లు ఇవ్వనట్టేనా?

మరోవైపు 65 మంది సిట్టింగ్‌ ఎంపీలను బీజేపీ పక్కనపెడుతుందని అంటున్నారు. సాధారణంగా 75 ఏళ్ల వయసు దాటితే వారిని బీజేపీ పరిగణనలోకి తీసుకోవడం లేదు.

By:  Tupaki Desk   |   21 Aug 2023 7:28 AM GMT
ప్రధాని మోడీ ఈ 65 ఎంపీలకు సీట్లు ఇవ్వనట్టేనా?
X

2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా బీజేపీకి ఘన విజయాలు సాధించిపెట్టారు.. ప్రధాని నరేంద్ర మోడీ. మరో పార్టీ మద్దతు అవసరం లేకుండానే బీజేపీ సొంతంగా మెజారిటీకి అవసరమైన స్థానాలను సాధించింది. ఇందుకు ప్రధాన కారణం మోడీ చరిష్మా అంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లోనూ ఈ మ్యాజిక్కును కొనసాగించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఇండియా పేరుతో కూటమి కట్టినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా ఆపలేవని ప్రధాని మోడీ భావిస్తున్నారని టాక్‌.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల వారీగా సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల ఆర్థిక స్థోమత, అభ్యర్థులకు ప్రజల్లో పరపతి, పార్టీ పట్ల విధేయత, అంకిత భావం తదితర అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.

మరోవైపు 65 మంది సిట్టింగ్‌ ఎంపీలను బీజేపీ పక్కనపెడుతుందని అంటున్నారు. సాధారణంగా 75 ఏళ్ల వయసు దాటితే వారిని బీజేపీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇదే నిబంధనతో ఏకంగా బీజేపీ కురువృద్ధుడు, ఆ పార్టీని ఇంత దాకా తెచ్చిన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వంటివారికే గత ఎన్నికల్లో సీట్లు కేటాయించలేదు. ఇదే కోవలో మరికొందరిని కూడా గత ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానాల నుంచి పక్కనపెట్టింది.

ఈసారి కూడా వయసు నిబంధనతో కొందరిని మోడీ పక్కన పెడతారని చెబుతున్నారు. అలాగే పనితీరు సరిగాలేనివారు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించనివారు, కార్యకర్తలకు అందుబాటులో లేని మరో 65 మందికి కూడా ఈసారి సీట్లు దక్కవని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే ఈ 65 మందిపై బీజేపీ అధిష్టానం ఒక అంచనాకొచ్చిందని అంటున్నారు.

ఈసారి సీట్లు దక్కబోవని భావిస్తున్న 65 మంది ఎంపీల్లో ఎక్కువ మంది మధ్యప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాల్లో ఉన్నారని చెబుతున్నారు. ఈ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో బీజేపీ 90 శాతం స్థానాలను కొల్లగొట్టింది. మరోసారి ఈ మ్యాజిక్కును రిపీట్‌ చేయాలని భావిస్తోంది.

ఇందులో భాగంగానే ప్రజల్లో అసంతృప్తి ఉన్న అభ్యర్థులు, వివాదాల్లో కూరుకుపోయినవారు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించనివారు, కార్యకర్తలకు అందుబాటులో లేనివారిలో 65 మందిని తప్పిస్తుందని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

పింక్‌ స్లిప్‌ అందుకోనున్న ఈ 65 మందితో బీజేపీ అధిష్టానం మాట్లాడిందని అని కూడా అంటున్నారు. వీరి స్థానంలో ఉన్నత విద్యావంతులు, ముఖ్యంగా యువతను పోటీ చేయించొచ్చని పేర్కొంటున్నారు. అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యుల్లో ఆర్థికంగా బలవంతులను ఈసారి లోక్‌ సభకు పోటీ చేయిస్తారని అంటున్నారు. మరి నరేంద్ర మోడీ చివరకు ఏం చేస్తారో వేచిచూడాల్సిందే.