Begin typing your search above and press return to search.

ఒకే ఒక్క మసాలా టీతో భారత్‌ అభివృద్ధిని ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి చూపిన మోదీ!

ఏటా జనవరి 26న మనదేశంలో జరిగే రిపబ్లిక్‌ డే వేడుకలకు ఏదో ఒక దేశానికి చెందిన అధ్యక్షుడో లేదో ప్రధానో రావడం సంప్రదాయంగా వస్తోంది.

By:  Tupaki Desk   |   26 Jan 2024 9:22 AM GMT
ఒకే ఒక్క మసాలా టీతో భారత్‌ అభివృద్ధిని ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి చూపిన మోదీ!
X

ఏటా జనవరి 26న మనదేశంలో జరిగే రిపబ్లిక్‌ డే వేడుకలకు ఏదో ఒక దేశానికి చెందిన అధ్యక్షుడో లేదో ప్రధానో రావడం సంప్రదాయంగా వస్తోంది. ఈ కోవలో ఈ ఏడాది ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ భారత్‌ కు ముఖ్య అతిథిగా ఏతెంచారు. రెండు రోజులపాటు ఆయన భారత్‌ లో పర్యటిస్తారు.

ఇందులో భాగంగా ఫ్రాన్స్‌ నుంచి నేరుగా అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ చేరుకున్నారు, అక్కడ అంబర్‌ కోట అందాలను వీక్షించారు. అలాగే జంతర్‌ మంతర్‌ అబ్జర్వేటరీ, హవా మహల్‌ లను కూడా ఆయన సందర్శించారు. భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఓపెన్‌ టాప్‌ జీపులో రోడ్‌ షో నిర్వహించారు.

పింక్‌ సిటీగా పేరుగాడించిన జైపూర్‌ లో ప్రసిద్ధ ప్రదేశాలను చూసిన తర్వాత ఇద్దరు నేతలు హవా మహల్‌ ముందు ఉన్న దుకాణంలో మసాలా టీ తాగారు. ఈ సందర్భంగా టీ షాపు నిర్వాహకుడికి యూపీఐ విధానంలో ప్రధాని మోదీ డిజిటల్‌ చెల్లింపులు చేశారు. తద్వారా ఆయన భారతదేశ అభివృద్ధిని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ కు పరోక్షంగా తెలియజేశారు.

దేశంలో ఉన్న మారుమూల గ్రామాల్లోనూ సాధారణ బడ్డీ కొట్లలోనూ యూపీఐ/ఫోన్‌ పే/గూగుల్‌ పే, తదితర పేమెంట్‌ గేట్‌ వేల ద్వారా సులభంగా చెల్లింపులు జరిగిపోతున్న సంగతి తెలిసిందే. టీ షాపు నిర్వాహకుడికి ఇలాగే చెల్లింపుల చేసిన ప్రధాని మోదీ డిజిటల్‌ గా భారత్‌ ఎంత అభివృద్ధి చెందిందో ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి పరోక్షంగా తెలియ చేశారు. అక్కడ ఆ షాపు యజమానికి డిజిటల్‌ చెల్లింపు చేసి భారత్‌లో ఇది ఎంత సర్వసాధారణం అన్న విషయాన్ని పరోక్షంగా తెలియజేశారు.

అంతేకాకుండా ఇక్కడకు వచ్చే సందర్శకులు సైతం ఇలాగే డిజిటల్‌ చెల్లింపులే చేస్తారని ప్రధాని మోదీ మాక్రాన్‌కు తెలియజేశారు. అలాగే మోదీ... మాక్రాన్‌ కోసం అక్కడే ఉన్న ఒక దుకాణంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఒక విగ్రహాన్ని కూడా కొనుగోలు చేశారు. దానికి కూడా డిజిటల్‌ చెల్లింపులు చేశారు.

ఇప్పుడు ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ కలిసి మసాలా టీ తాగిన వీడియో, అందుకు డిజిటల్‌ చెల్లింపులు చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.