Begin typing your search above and press return to search.

సముద్ర గర్భంలో ప్రధాని మోదీ మరో సాహసం.. ఈసారి ఇక్కడ!

తన సొంత రాష్ట్రం గుజరాత్‌ లో పర్యటించిన ప్రధాని మోదీ సముద్ర గర్భంలోకి వెళ్లారు.

By:  Tupaki Desk   |   25 Feb 2024 10:42 AM GMT
సముద్ర గర్భంలో ప్రధాని మోదీ మరో సాహసం.. ఈసారి ఇక్కడ!
X

ఇటీవల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ లో, భారతదేశ దక్షిణ తీరం రామేశ్వరంలోని సముద్ర జలాల్లో జల క్రీడలను ఆస్వాదించిన ప్రధాని మోదీ మరో సాహసానికి పూనుకున్నారు. లక్షద్వీప్‌ లో అరేబియా సముద్రం, రామేశ్వరంలో హిందూ మహా సముద్రం+బంగాళాఖాతం అందాలను వీక్షించిన ఆయన ఈసారి అరేబియా సముద్రాన్ని ఎంచుకున్నారు.

తన సొంత రాష్ట్రం గుజరాత్‌ లో పర్యటించిన ప్రధాని మోదీ సముద్ర గర్భంలోకి వెళ్లారు. సుప్రసిద్ధ యాత్రా స్థలం.. శ్రీకృష్ణుడి ఒకప్పటి రాజధాని నగరమైన ద్వారకలో ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడ ద్వారకను బైట్‌ ద్వారకతో అనుసంధానిస్తూ నిర్మించిన సుదర్శన్‌ సేతును ఆయన ప్రారంభించారు.

ద్వారకలో ద్వారకాదీశ్‌ (శ్రీకృష్ణుడి) ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపిన మోడీ సముద్ర గర్భంలో మునిగిపోయిన శ్రీకృష్ణుడి ద్వారకా నగరాన్ని దర్శించుకున్నారు. నీటి అడుగులోకి వెళ్లి.. మునిగిపోయిన ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో పూజలు చేశారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ప్రధానిగా ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు.

డైవింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఆధ్వర్యంలో డైవింగ్‌ చేసి సముద్ర గర్భంలోని ద్వారకను సందర్శించారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంగా ద్వారకను పేర్కొంటారనే విషయం తెలిసిందే. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సముద్ర గర్భంలోని ద్వారకకు వెళ్లిన ప్రధాని మోదీ నెమలి పింఛాలను, పూజా సామాగ్రిని తీసుకెళ్లి పూజలు నిర్వహించారు.

అంతకు ముందు ప్రధాని మోదీ ద్వారకాధీష్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి హిందూ సంప్రదాయంలో కాషాయం దుస్తులు ధరించి, మూడు నామాలు పెట్టుకుని ప్రత్యేక ఆకర్షణతో కనిపించారు.

ఇక ద్వారకకు వచ్చే భక్తులకు ప్రధాని మోదీ సర్‌ ప్రైజింగ్‌ గిఫ్టు ఇచ్చారు. ఓఖా ప్రధాన భూభాగాన్ని బైట్‌ ద్వారక ద్వీపాన్ని కలిపే సుదర్శన్‌ సేతును ఆయన ప్రారంభించారు. సుమారు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ కేబుల్‌ బ్రిడ్జి పొడవు 2.32 కిలోమీటర్లు ఉంటుంది. ఈ తీగల వంతెన దేశంలోనే అత్యంత పొడవైనది.

ఈ వంతెనకు రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడు జీవితంలో ప్రత్యేక ఘట్టాలను చెక్కారు. అలాగే తీగల వంతెనపై సోలార్‌ విద్యుత్‌ ను ఉత్పత్తి చేసేలా ప్యానెల్స్‌ ను సైతం ఏర్పాటు చేశారు.