Begin typing your search above and press return to search.

అపుడు బెంగుళూరు...ఇపుడు హైదరాబాద్ : మోడీ లాస్ట్ పంచ్ కి రిజల్ట్ ...?

మరిపుడు హైదరాబాద్ లో మోడీ రోడ్ షో ఏ విధంగా కమలానికి తెలంగాణాలో ప్లస్ అవుతుంది అన్న చర్చ అయితే సాగుతోంది.

By:  Tupaki Desk   |   11 Oct 2023 1:30 PM GMT
అపుడు బెంగుళూరు...ఇపుడు హైదరాబాద్ :  మోడీ లాస్ట్ పంచ్ కి రిజల్ట్ ...?
X

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ మొత్తానికి స్టార్ కాంపెనియర్ గా ఉన్నారు. ఆయన ఎన్నికలు వచ్చిన రాష్ట్రానికి పలు మార్లు తిరుగుతారు సభలు పెడతారు. సుడిగాలి పర్యటనలు చేస్తారు. ఒక విధంగా చుట్టేస్తారు. గతంలో మోడీ తిరిగిన చాలా చోట్ల ఆ పార్టీకి ఎక్కువగా విజయావకాశాలు ఉండేవి. కానీ దేశంలో తొమ్మిదేళ్ల పాలన ముగిసిన తరువాత యాంటీ ఇంకెంబెన్సీ సహజంగానే పెరుతోంది. ఆ ప్రభావంతో మోడీ ఇమేజ్ కూడా క్రమంగా తగ్గుతోందా అన్న చర్చ సాగుతోంది.

మోడీ ఇటీవల కాలంలో కర్నాటక ఎన్నికలలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక చివరి రోజున బెంగళూరు లో అతి పెద్ద రోడ్ షోని నిర్వహించారు. అయినా సరే అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ భారీ తేడాతో కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలు అయింది. అది జరిగిన ఆరేడు నెలల తరువాత ఇపుడు తెలంగాణా ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ పాత ఎన్నికల ఎత్తులనే వాడుతోంది.

మోడీతో అనేక సభలలో ప్రసంగాలు చేయించాలని చూస్తోంది. ఇక నవంబర్ 30న తెలనగణాలో ఎన్నికలు ఉన్నాయి. అంటే ఆ ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు హైదరాబాద్ అంతటా కలుపుకుని బెంగళూర్ రోడ్ షోని మించేలా సూపర్ రోడ్ షో ఒకటి మోడీ తో నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

ఈ రోడ్ తో తరువాత పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని కూడా భావిస్తోంది. అయితే బెంగళూర్ రోడ్ షో రికార్డు అయితే క్రియేట్ చేసింది కానీ ఫలితం మాత్రం బ్యాడ్ గా వచ్చింది. అధికారంలో ఉన్న బీజేపీ ఓడింది. పైగా బలం ఉన్న కర్నాటకలో రోడ్ షో బీజేపీకి ఏ మాత్రం కలసిరాలేదు అని అంటున్నారు.

మరిపుడు హైదరాబాద్ లో మోడీ రోడ్ షో ఏ విధంగా కమలానికి తెలంగాణాలో ప్లస్ అవుతుంది అన్న చర్చ అయితే సాగుతోంది. తెలంగాణాలో బీజేపీ బలం ఏంటి అన్నది ఈ ఎన్నికలే రుజువు చేయబోతున్నాయి. ఇంకో వైపు చూస్తే బీజేపీ తన పార్టీకి సంబంధించిన అభ్యర్ధుల జాబితాను నాలుగు విడతలుగా రిలీజ్ చేస్తుంది అని అంటున్నారు.

తొలి జాబితా ఈ నెల 15న 39 మందితో రిలీజ్ చేస్తుందని ప్రచారం సాగుతోంది. అలాగే రెండవ జాబితా దసరా వేళ రిలీజ్ చేస్తుందని, మూడవ జాబితా అక్టోబర్ చివరలో నాలుగవ జాబితా నవంబర్ తొలి వారంలో రిలీజ్ చేస్తుందని అంటున్నారు. అలా నవంబర్ రెండో వారం నుంచి మొదలయ్యే నామినేషన్ల ఘట్టం వేళకు టోటల్ గా 119 మంది అభ్యర్ధులతో బీజేపీ రెడీగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి బీజేపీ జాబితాలో ఏ ఏ పేర్లు ఉంటాయి, ఏ పార్టీల నుంచి బీజేపీలోకి నేతలు వచ్చి చేరుతారో.