Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల‌కు ముందు మోడీ చేతికి ఎముక లేకుండా పోతోందే!

తాజాగా యూపీలో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని.. 42 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప‌లు ప్రాజక్టుల‌కు శ్రీకారం చుట్టారు. ఒకేసారి 15 ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

By:  Tupaki Desk   |   10 March 2024 8:28 AM GMT
ఎన్నిక‌ల‌కు ముందు మోడీ చేతికి ఎముక లేకుండా పోతోందే!
X

మ‌రికొన్ని రోజుల్లో పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ రానున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప‌లు ప్రాజెక్టుల‌కు ఆయన శ్రీకారం చుడుతున్నారు. చేతికి ఎముక లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా యూపీలో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని.. 42 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప‌లు ప్రాజక్టుల‌కు శ్రీకారం చుట్టారు. ఒకేసారి 15 ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటిలో 12 కొత్త టర్మినల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి.

యూపీలోని అజమ్‌ఘడ్ పర్యటనకు వెళ్లిన ప్ర‌ధాని వర్చువల్‌గా వీటిని ప్రారంభించారు. ఈ అన్ని ప్రాజెక్ట్‌ల విలువ రూ.42,000 కోట్లుగా ఉంది. ఈ కొత్త టర్మినల్స్‌తో అదనంగా ఏటా 6.2 కోట్ల మంది ప్రయాణించేందుకు వెసులుబాటు కలగనుంది. ఈ టర్మినల్స్‌ సామర్థ్యాన్ని పెంచేందుకే వాటి రూపు రేఖలు మారుస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మించనున్నారు.

ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్స్, ఎల్ ఈడీ లైటింగ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. యూపీలోని సంస్కృ తిని, చరిత్రని దృష్టిలో పెట్టుకుని అవి ప్రతిబింబించేలా ఈ ఎయిర్‌పోర్ట్ టర్మినల్స్‌ని నిర్మిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని అభివృద్ధి పనులను చూసి దేశ ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారని అన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల సీజన్‌లో హామీలు మాత్రమే ఇచ్చేదని, కానీ తమ ప్రభుత్వం మాత్రం చెప్పిన ప్రతి పనినీ పూర్తి చేస్తోందని స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు వచ్చి హడావుడి చేసే వైఖరి తమది కాదని తేల్చి చెప్పారు. 2019లో కొన్ని ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశామని, అది ఎన్నికల కోసం చేయలేదని వెల్లడించారు. అజంఘడ్ ప్రజలు తమపై చూపిస్తున్న ప్రేమని, గౌరవాన్ని దేశమంతా గమనిస్తోందని అన్నారు. ఇంతగా తమని విశ్వసిస్తుండడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.