Begin typing your search above and press return to search.

తమిళులపై మోడీ సమ్మోహనాస్త్రం.. చదివితే చెవులూరాల్సిందే!

తానెంత కష్టపడినా ఫలం దక్కని తమిళనాడు మీద ఇప్పుడు ఆయన చూపు పడింది.

By:  Tupaki Desk   |   2 April 2024 5:50 AM GMT
తమిళులపై మోడీ సమ్మోహనాస్త్రం.. చదివితే చెవులూరాల్సిందే!
X

మిగిలిన రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సాధారణంగా ఎవరైనా సరే.. సాదాసీదా వ్యక్తితో సహా. తమకు ఏదైనా కావాలన్నా.. ఎవరినైనా కోరుకున్నా.. ముందు ఏం చేస్తాం? కాస్తంత ప్రేమను ప్రదర్శిస్తాం. వారికి సాయంగా ఉంటాం. అండగా నిలుస్తాం. వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి మనసులో కాస్తంత సానుకూలతను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ.. మోడీ మాష్టారు భిన్నం. తాను టార్గెట్ చేసిన దాన్ని సొంతం చేసుకోవాలనే లక్ష్యం తప్పించి.. దానికి ఏమైనా ఇవ్వాలి.. చేయాలన్న ఆలోచన మాత్రం పెద్దగా చేయరు. తానెంత కష్టపడినా ఫలం దక్కని తమిళనాడు మీద ఇప్పుడు ఆయన చూపు పడింది.

అది కూడా రోటీన్ గా.. రెగ్యులర్ మాదిరి కాకుండా కాస్తంత సీరియస్ గానే ఆయన ఫోకస్ చేస్తున్నారు. తమిళుల మనసుల్ని దోచుకునేందుకు.. వారిలో తన పట్ల సానుకూలత వ్యక్తమయ్యేందుకు వీలుగా వారి బలహీనత అయిన వారి భాషను టార్గెట్ చేశారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన మోడీ మాటల్ని వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే పదేళ్లు అధికారంలో ఉన్న ఆయన నిజంగానే తమిళనాడుకు ఏమైనా చేయాలని అనుకుంటే.. ఈపాటికి కచ్ఛితంగా చేసే వారు.కానీ.. అలాంటిదేమీ చేయకపోవటం వెనుకున్న అర్థం ఏమిటి?

తమిళనాడు అన్నా.. తమిళం అన్నా మోడీకి అంత ఇష్టమైతే.. దానికి సంబంధించిన అంశాల మీద ప్రాథమికంగా అయినా పని చేసి ఉండాలి కదా? తన ప్రయత్నం గురించి ఆయన చెప్పాలి కదా? కానీ.. అలాంటిదేమీ లేకుండా తాజాగా తన ప్రేమను పొంగి పొర్లించటం మోడీ చతురతకు నిదర్శనంగా చెప్పాలి. తమిళనాడును తన వశం చేసుకోవటానికి వీలుగా ఆయన సంధించిన సమ్మోహన అస్త్రానికి తమిళులు ఎలా రియాక్టు అవుతారో చూడాలి. తాజాగా తమిళం గురించి తమిళ ప్రజల ఆహారం గురించి మోడీ సారు చెప్పిన మాటల్ని చదవితే చెవులూరాల్సిందే.

తమిళనాడుతో తనకు ఐదు దశాబ్దాలుగా అనుబంధం ఉందన్న ఆయన.. ఎమర్జెన్సీ కాలంలో పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేయటం కోసం తమిళనాడుకు వచ్చానని చెప్పిన మోడీ.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నిర్వహించిన ఏక్తా యాత్రలోనూ పాల్గొన్నట్లుగా చెప్పారు. ఈరోడ్ కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కుమరన్ కుటుంబానికి చెందిన 90 ఏళ్ల పెద్ద వయస్కురాలు వచ్చి తనను ఆశీర్వదించటం మరుపురాని అనుభూతిగా పేర్కొన్నారు.

తాను తమిళం నేర్చుకుంటానన్న ఆయన.. ఆ భాష అంటే తనకెంతో ప్రేమ.. గౌరవం ఉందన్నారు. తాను తమిళం నేర్చుకొని ఐక్యరాజ్యసహితిలో తమిళ భాషలో ప్రసంగిస్తానని శపధం చేశారు. ఇంతవరకు తమిళ భాషకు అన్యాయం జరిగిందన్న ఆయన.. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న తమిళ భాష భారతదేశంలో ఉందన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పలేకపోయామన్నారు. తమిళ ఘన చరిత్రను ప్రపంచమంతా చెప్పాలన్న ఆయన.. భాషను రాజకీయం చేసిన కారణంగానే తమిళం దేశమంతా విస్తరించలేకపోయిందన్నారు.

ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో మాట్లాడుతూ.. ‘‘ఇంకా నయం ఇడ్లీ.. దోసెలను కూడా రాజకీయ చేసి ఉంటే అవి తమిళాడుకే పరిమితం అయి ఉండేవి. ఇప్పుడు అన్ని చోట్ల ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి. ఇడ్లీ.. దోసెల మాదిరే తమిళం కూడా ప్రపంచమంతా విస్తరించాలి. నాకు తమిళ వంటకాలైన ఉప్మా.. పొంగల్ ఇష్టం’’ అంటూ తనకున్న ఇష్టాయిష్టాలను బయటపెట్టారు. మొత్తంగా తమిళుల్ని ప్రసన్నం చేసుకోవటానికి వారెంతో ఆరాధించే తమిళ భాష మీద గురి పెట్టిన మోడీ సమ్మోహనాస్త్రాన్ని తమిళులు ఏ రీతిలో అర్థం చేసుకుంటారు? ఎలా రియాక్టు అవుతారన్నది సార్వత్రిక ఎన్నికల ఫలితాల్ని చూస్తే అర్థమవుతుందని చెప్పక తప్పదు.