Begin typing your search above and press return to search.

“బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు” పై మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన అని బీజేపీ విమర్శలు చేస్తుంటే... బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతుంది!

By:  Tupaki Desk   |   12 April 2024 12:58 PM GMT
“బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం  రద్దు” పై మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు!
X

రానున్న లోక్ సభ ఎన్నికల్లోను గెలిచి మరోసారి సత్తాచాటాలని భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే భావిస్తున్న సంగతి తెలిసిందే! ఇదే సమయంలో... ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి కంకణం కట్టుకుంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన అని బీజేపీ విమర్శలు చేస్తుంటే... బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతుంది!

అవును... గత ఐదేళ్లుగా దేశంలో నెలకొన్ని పలు పరిణామాలను ప్రస్థావిస్తూ.. మరోసారీ దేశంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి భారత రాజ్యాంగాన్ని మారుస్తారని కొందరంటే... సమూలంగా రద్దు చేసి సరికొత్త రాజ్యాంగాన్ని తెరపైకి తెచ్చినా ఆశ్చర్యం లేదని ఇంకొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించారు. ఈ తరహా విమర్శలపై ఆసక్తికరంగా స్పందించారు.

ఇందులో భాగంగా... తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని చెప్పిన మోడీ... బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కూడా ఇప్పుడు దాన్ని రద్దు చేయలేరని చెప్పుకొచ్చారు! రాజస్థాన్‌ లోని బార్మర్‌ లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ.. దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్‌ అండగా నిలుస్తోందని విమర్శించారు. ఇదే సమయంలో... దేశాన్ని బలహీనపరిచేందుకు విపక్షాల కూటమి ప్రయత్నిస్తోందంటూ ఫైరయ్యారు.

ఈ క్రమంలో... తమ ప్రభుత్వానికి రాజ్యాంగమే సర్వస్వం అని చెప్పుకొచ్చిన ప్రధాని మోడీ... ఇప్పుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ స్వయంగా వచ్చినా కూడా రాజ్యాంగాన్ని రద్దుచేయలేరని అన్నారు. గతంలో దేశంలో ఎమర్జెన్సీని విధించడం ద్వారా రాజ్యాంగాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఫైరయ్యారు.

ఇదే సమయంలో... అణు నిరాయుధీకరణ గురించి విపక్షాలు మాట్లాడటం శోఛనీయమని తెలిపిన మోడీ... పక్కన అణ్వాయుధాలు కలిగిన దేశాలు ఉండగా, వీటి నిర్మూలన గురించి మాట్లాడుతారా? అంటూ ప్రశ్నించారు.

కాగా... రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే పార్లమెంటులో బీజేపీ భారీ మెజార్టీ కావాల్సిన అవసరం ఉందంటూ ఆ పార్టీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! దీంతో ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండి పడుతున్నాయి. మరోపక్క... అనంతకుమార్‌ వ్యక్తిగత అభిప్రాయం బీజేపీ సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా... విపక్షాలు మాత్రం వాయించి వదులుతున్నట్లు తెలుస్తున్నాయి!!